ప్లేస్ మారినా ఆట మారలే.. రెండో టీ20లోనూ టీమిండియా ఓటమి

ప్లేస్ మారినా ఆట మారలే.. రెండో టీ20లోనూ టీమిండియా ఓటమి

ఆసియా కప్ 2023, వరల్డ్ కప్ 2023 వంటి మెగా టోర్నీల ముందు భారత ఆటగాళ్ల ప్రదర్శన అభిమానులను నిరుత్సాహ పరుస్తోంది. వరుస విజయాలతో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతారనుకుంటే.. వరుస ఓటములతో విదేశీగడ్డపై తలెత్తుకోనివ్వకుండా చేస్తున్నారు.

వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టీ20లోనూ భార‌త బ్యాట‌ర్లు త‌డ‌బడ్డారు. దీంతో తొలి టీ20 మ్యాచ్ ఫలితం మరోసారి పునరావృతం అయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 152 పరుగులు చేయగా.. విండీస్ బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని పడుతూ లేస్తూ చేధించారు.

ఈ మ్యాచ్‌లో హార్దిక్ సేన బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమైంది. మొదట బ్యాటర్లు విఫలమవ్వడంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 152 పరుగులకే పరిమితమైంది. యువ బ్యాటర్ తిల‌క్ వ‌ర్మ (51)మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. గిల్ 7, ఇషాన్ కిషన్ 27, సూర్యకుమార్ యాదవ్ 1, సంజూ సాంసన్ 7,  హార్దిక్ పాండ్యా 24.. ఇలా ఒకరివెంట మరొకరు పెవిలియన్ చేరారు. ఒక‌వైపు వికెట్లు ప‌డుతున్నా మరోవైపు తిల‌క్.. విండీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. అతని పోరాటం వల్ల భార‌త్ ఆమాత్రం స్కోరైనా చేయ‌గ‌లిగింది.

అనంతరం 153 పరుగుల లక్ష్య చేధనకు దిగిన విండీస్ బ్యాటర్లు పడుతూ లేస్తూ విజయాన్ని పూర్తి చేశారు. తొలి ఓవర్‌లో పాండ్యా రెండు వికెట్లు తీసి విజయంపై ఆశలు కల్పించినా.. అక్కడినుండి మ్యాచ్ పూర్తిగా విండీస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. భారత బౌలర్లపై ఎదురుదాడికి పూరన్(67; 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) నలువైపులా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే ఆఖరిలో మరోసారి వరుస వికెట్లు పడి విజయం దిశగా అడుగులు పడినా.. హార్దిక్ చెత్త కెప్టెన్సీ దాన్ని దూరం చేసింది.  అల్జారి జోసెఫ్(10), అకీల్ హుస్సేన్(16) జోడి విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.

ఈ విజయంతో విండీస్ ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక ఈ ఇరు జట్ల మధ్య మంగళవారం(ఆగస్ట్ 8) ఇదే వేదికపై మూడో టీ20 జరగనుంది.