బజ్‌బాల్‌కు దీటుగా 'డ్రావ్‌బాల్'.. టీమిండియా జోరుకు పలు రికార్డులు బ్రేక్

బజ్‌బాల్‌కు దీటుగా 'డ్రావ్‌బాల్'..  టీమిండియా జోరుకు పలు రికార్డులు బ్రేక్

టెస్ట్ ఫార్మాట్‌లో గతేడాది కాలంగా వినిపిస్తున్న ఏకైక మాట 'బజ్‌బాల్'. బెన్ స్టోక్స్ నాయకత్వంలోని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తమ ఆటతీరుకు పెట్టుకున్న పేరిది. ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ముద్దు పేరు ‘బజ్’‌కు బాల్ తగిలించి దానిని బజ్‌బాల్ ఆట అంటున్నారు.  కాగా టీమిండియా ఇప్పుడు అంతకు మించి దూకుడు ప్రదర్శించింది. 

వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో.. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. టీ20 ఆటను తలపిస్తూ.. 24 ఓవర్లలోనే 181 పరుగులు చేశారు. ఈ క్రమంలో గత పలు రికార్డులు గల్లంతయ్యాయి. దీంతో భారత అభిమానులు.. టీమిండియా ఆట తీరును హెడ్‌‌కోచ్‌ రాహుల్ ద్రవిడ్ పేరు కలిసేలా 'డ్రావ్‌బాల్' అని కామెంట్స్ చేస్తున్నారు. 

విండీస్‌ బౌలర్లకు టీ20 రుచి

తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను  255 పరుగుల వద్ద ఆలౌట్ చేసిన భారత జట్టు..  రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (38; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రోహిత్ శర్మ (57; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇద్దరూ టీ2‌0తరహాలో దూకుడు ప్రదర్శించారు. తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలోనే 98 పరుగులు జోడించారు. 

అనంతరం రోహిత్, జైస్వాల్ నిష్క్రమించినా.. ఇషాన్ కిషన్ (52 నాటౌట్; 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (29 నాటౌట్; 37 బంతుల్లో 1 ఫోర్) జోడి. .ఆ దూకుడును కొనసాగించారు. దీంతో టీమిండియా 183 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

పలు రికార్డులు బ్రేక్

  • రెండో ఇన్నింగ్స్‌లో 12.2 ఓవర్లలోనే(74 బంతులు) వంద పరుగులు చేసిన టీమిండియా.. శ్రీలంక పేరిట ఉన్న ఫాస్టెస్ట్ 100 రికార్డును బ్రేక్ చేసింది. 2001లోశ్రీలంక జట్టు.. బంగ్లాదేశ్‌పై 13.2 ఓవర్లలో  వంద పరుగులు చేసింది.
  • రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేసిన రోహిత్.. తద్వారా టెస్టులలో  వరుసగా 30 ఇన్నింగ్స్‌లలో  'డబుల్ డిజిట్' స్కోరు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దనె రికార్డును బద్దలు కొట్టారు. మహేళ.. 29 ఇన్నింగ్స్‌లలో  డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. (రోహిత్ గత 30 ఇన్నింగ్స్‌ల స్కోర్లు:  12, 161, 26, 66, 25*, 49, 34, 30, 36, 12*, 83, 21, 19, 59, 11, 127, 29, 15, 46, 120, 32, 31, 12, 12, 35, 15, 43, 103, 80, 57)
  • రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ 33 బంతుల్లోనే  అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నారు. భారత్ తరఫున ఇది ఫాస్టెస్ట్ ఫిఫ్టీలలో రెండోది. గతంలో రిషభ్ పంత్.. 28 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించారు. కాగా ధోని 2006లో పాకిస్తాన్ పై 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని కలుపుకుంటే టీమిండియా.. విండీస్ ముందు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. కాగా నాలుగో రోజు ఆటముగిసేసరికి వెస్టిండీస్.. 32 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. చివరిరోజు ఆట మిగిలివుండగా భారత జట్టు.. విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది.