జట్టుతో కనిపించని కోహ్లీ.. మూడో వన్డేలోనూ నో ఛాన్స్!

జట్టుతో కనిపించని కోహ్లీ.. మూడో వన్డేలోనూ నో ఛాన్స్!

వన్డే ప్రపంచ కప్ 2023 సన్నద్ధత కోసం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ చేస్తున్న ప్రయోగాలు ఎవరికీ అంతుపట్టడం లేదు. విశ్రాంతి పేరుతో రెండో వన్డేకు సీనియర్ బ్యాటర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను కూర్చోబెట్టిన ద్రావిడ్.. మరోసారి అలాంటి ప్రయోగాలు చేసేలా కనిపిస్తున్నారు. ఎందుకంటే మూడో వన్డే కోసం ట్రినిడాడ్ చేరిన టీమిండియా సభ్యుల్లో కోహ్లీ లేరు. 

తొలి వన్డేలో కష్టపడి విజయం సాధించిన రోహిత్ సేన.. రెండో వన్డేలో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఆడలేదు. యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో సీనియర్లిద్దరిని విశ్రాంతి పేరుతో కూర్చోబెట్టారు. దీంతో జూనియర్లు దారుణంగా విఫలమై విండీస్‌కు విజయాన్ని అప్పనంగా కట్టబెట్టారు. పోనీ, సిరీస్ డిసైడర్ మ్యాచులోనైనా వీరు బరిలోకి దిగుతారా! అంటే అదీ అనుమానంగానే కనిపిస్తోంది. అందుకు కారణం.. మూడో వన్డే కోసం బార్బడోస్ నుంచి ట్రినిడాడ్ చేరిన టీమిండియా ఆటగాళ్లలో కోహ్లీ లేరు. దీంతో అతను ఈ మ్యాచ్‌లోనూ ఆడకపోవచ్చన్న వార్తలొస్తున్నాయి.

ఆసియా కప్ 2023, వరల్డ్ కప్ 2023

రాబోవు మూడు నెలల్లో రెండు ప్రతిష్టాత్మక టోర్నీలు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీలలో టీమిండియా బ్యాటింగ్‌కు పిల్లర్లైన రోహిత్, కోహ్లీ ఇద్దరూ తప్పక ఆడాల్సిందే. ఈ క్రమంలో మిగతా స్థానాల్లో ప్లేయర్లను కన్ఫర్మ్ చేయడానికి మేనేజ్‌మెంట్ రకరకాల ప్రయోగాలు చేస్తోందన్నది వాస్తవం. రెండో వన్డేలో వీళ్లిద్దర్నీ కూర్చోపెట్టడం గురించి మాట్లాడిన ద్రావిడ్.. ఈ ఇద్దర్నీ ఆడించడం వల్ల తమకు కొత్తగా ఎలాంటి సమాధానాలు దొరకబోవని, దాని కన్నా కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం మంచిదని అభిప్రాయపడ్డారు. 

మూడో వన్డేలో కోహ్లీ బరిలోకి దిగకపోతే అది ద్రావిడ్ వ్యూహంలో భాగమే అనుకోవాలి. అయితే అభిమానులు మాత్రం కోహ్లీని ఎందుకు పక్కనపెడుతున్నారని మేనేజ్మెంట్‌ని ప్రశ్నిస్తున్నారు. గాయపడ్డారా? లేదా విశ్రాంతినిచ్చారా? అంటూ రకరకాల ప్రశ్నలు లేవనెత్తున్నారు. మరి జట్టు సభ్యులతో కనిపించని కోహ్లీ ఎక్కడకి వెళ్ళారన్నది మరో ప్రశ్న.