వీడియో: ఎంత మోసం.. మాటిచ్చి దొంగ దెబ్బ తీసిన పాండ్యా

వీడియో: ఎంత మోసం.. మాటిచ్చి దొంగ దెబ్బ తీసిన పాండ్యా

వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ 159 పరుగులు చేయగా.. అనంతరం భారత బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించారు. అయితే ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన ఒక పని అతనిని తీవ్ర విమర్శలు పాలు చేస్తోంది.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన  హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ చాలా ఓర్పుతో ఆడాడు. సూర్యకుమార్‌తో కలిసి 83 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయానికి పునాది వేశాడు. అయితే ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.. ఈ యువ క్రికెటర్. దీనంతటికి కారణం.. హార్దిక్ పాండ్యా. 

ఏం జరిగిందంటే..

భారత్‌ విజయానికి 2 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో హార్దిక్‌ పాండ్యా స్ట్రైక్‌ వెళ్ళాడు. ఆ ఓవర్‌లో ఇంకా రెండు బంతులు మిగిలి ఉండడంతో హార్దిక్‌ సింగిల్‌ తీసి తిలక్‌ వర్మకు స్ట్రైక్‌ ఇస్తాడని అంతా భావించారు. దీంతో తిలక్‌ తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకుంటాడని కామెంటేటర్లు  చెప్పుకొచ్చారు. కానీ పాండ్యా మాత్రం వీర యోధుడిలా సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ ఫినిష్‌ చేశాడు. దీంతో తిలక్‌ 49 పరుగులతో నిరుత్సాహపడాల్సి వచ్చింది.

అయితే.. విన్నింగ్ షాట్‌ ఆడడానికి ముందు పాండ్యా.. తిలక్‌ వర్మతో మాట్లాడిన ఆడియో టేప్‌ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తిలక్‌ 47 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఉన్నప్పుడు పాండ్యా, అతనితో.. 'నువ్వు చివరి వరకు ఉండి, మ్యాచ్‌ను ముగించాలి. కంగారు పడకుండా జాగ్రత్తగా ఆడూ.." అంటూ ఓ పెద్దన్నలా సలహా ఇచ్చాడు. కానీ దానిని పాటించకుండా సిక్స్ మలిచి విమర్శలు కొని తెచ్చుకున్నాడు.

ధోనితో పోలికా.. తొక్కేం కాదు

తనను తాను గొప్ప క్రికెటర్ అనుకునే పాండ్యా చాలా స్వార్థపరుడని, అతనిలో నాయకత్వ లక్షణాలు లేవని అతనిని విమర్శిస్తున్నారు. ధోనిని చూసైనా ఎలాంటి సందర్భాల్లో ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలని సూచిస్తున్నారు. కాగా గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ధోని.. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న బాట్లర్లు ఏదైనా మైలురాయికి దగ్గరగా ఉన్నప్పుడు ఢిఫెన్స్‌ ఆడి వారికి స్ట్రైక్‌ వచ్చేలా చేసేవాడు.

అనాడు కోహ్లీ కోసం..

2014 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో.. టీమిండియా విజయానికి 7 బంతుల్లో ఒక్క పరుగు అవసరం కాగా, స్ట్రైక్ లో ధోని సిక్స్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ మహేంద్రుడు అలా చేయలేదు. మ్యాచ్ ను గెలుపు వరకూ తీసుకొచ్చిన కోహ్లీకే ఆ ఘనత దక్కాలని ఆ ఓవర్ ఆఖరి బంతిని ఢిపెన్స్‌ ఆడి కోహ్లికి స్ట్రైక్‌ ఇచ్చి అందరి మనసులను గెలుచుకున్నాడు.అలాంటి ఆలోచన నీకెందుకు రాలేదని అభిమానులు పంద్యాను దుయ్యబడుతున్నారు.