రోహిత్, కోహ్లీని కాదు.. అతన్ని నమ్ముకోండి: పాక్ మాజీ ప్లేయర్

రోహిత్, కోహ్లీని కాదు.. అతన్ని నమ్ముకోండి: పాక్ మాజీ ప్లేయర్

రాబోవు రెండు నెలల్లో ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి రెండు మెగా టోర్నీలు జరగనున్నాయి. ఈ రెండు టోర్నీలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందన్నది అభిమానులను వేధిస్తోన్న ప్రశ్న. నాలుగేళ్ళ క్రితం 2019లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్‌లోనే ఇంటిదారి పట్టిన భారత జట్టు.. ఆసియన్ దేశాల మధ్య జరిగిన ప్రతిష్టాత్మక ఆసియా కప్‌లో సూపర్ 4లోనే నిష్క్రమించింది. దీంతో టీమిండియా ఈసారైనా గతాన్ని మర్చిపోయేలా చేస్తుందా? లేదా? అందుకున్న దారులేంటి? అన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. 

ఎప్పుడూ ఏ టోర్నీ జరిగినా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలపై భారీ అంచనాలు ఉండడం సహజం. వీరిద్దరి అనుభవమే అందుకు కారణం. ఏళ్ల తరబడి జట్టులో స్థిరపడిపోయిన ఈ ఇద్దరు వీరులు జట్టుకు ఎలాంటి కష్టాలు ఎదురైనా.. భయటపడేయగలరన్నది అభిమానుల ఆశ. అందుకు తగ్గితే వీరిద్దరూ అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలకడగా రాణిస్తుంటారు. ఒకవేళ వీరు విఫలమయ్యారా! ఆ టోర్నీ గురుంచి మరిచిపోయి.. రాబోవు ఈవెంట్ గురుంచి ఆలోచించాల్సిందే. 

రోహిత్, కోహ్లీని కాదు.. సూర్యని నమ్మండి

వెస్టిండీస్‍తో జరిగిన మూడో టీ20 తరువాత భారత స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్ లో సూర్య 44 బంతుల్లోనే 83 పరుగులు చేసి భారత్ గెలుపును ఏకపక్షం చేశాడు. ఈ క్రమంలో అతన్నే నమ్ముకోవాలని పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.

తన యూట్యూబ్ ఛానెల్‍లో మాట్లాడిన అక్మల్.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‍ను వన్‍సైడ్  చేయగల సామర్థ్యం సూర్యకు ఉందని అభిప్రాయపడ్డాడు. "వెంటవెంటనే వికెట్లు పడినప్పుడు.. సీనియర్ బ్యాటర్లు బాధ్యతగా ఆడుతూ పని పూర్తి చేసేందుకు చూస్తారు. అయితే సూర్య మాత్రం వేరు. అలాంటి పరిస్థితుల్లోనూ వేగంగా పరుగులు చేయాలనుకునే ప్లేయర్. ఆ పట్టుదలతోనే అతడు మ్యాచ్ లను వన్‍సైడ్ చేయగలడు.అది ఈ మ్యాచ్(ఇండియా vs వెస్టిండీస్ మూడో టీ20) అయినా.. రాబోవు మ్యాచులైనా.." అని అక్మల్ అన్నాడు. 

నేడే నాలుగో టీ20

ఐదు మ్యాచ్‪ల టీ20ల సిరీస్‍లో 2-1తో విండీస్ జట్టు ఆధిక్యంలో ఉంది. నేడు(ఆగస్టు 12) ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సమం చేయాలని హార్దిక్ సేన భావిస్తుంటే.. గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని విండీస్ వీరులు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో అమెరికా గడ్డపై  ఈ మ్యాచ్ జరగనుంది.