IND vs ZIM: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లోనే ఘనమైన రికార్డు

IND vs ZIM: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్‌లోనే ఘనమైన రికార్డు

భారత యువ క్రికెటర్ అభిషేక్ శ‌ర్మ (100) తన రెండో అంతర్జాతీయ మ్యాచ్ లోనే సెంచరీ బాదాడు. అదీ టీ20లో.  హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. ఆతిథ్య జట్టు బౌల‌ర్లను ఊచ‌కోత కోశాడు. సిరీస్ స‌మం చేయాలంటే త‌ప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బౌలర్లకు వణుకు పుట్టించాడు. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌‌గా మలిచిన ఈ యువ క్రికెటర్.. 47 బంతుల్లోనే వంద మార్క్ చేరుకున్నాడు. తద్వారా  అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో శతకం బాదిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

33 బంతుల్లో అర్ధశతకం సాధించిన అభిషేక్.. 50 నుంచి 100కి కేవలం 13 బంతులు తీసుకోవడం గమనార్హం. ఈ యువ కెరటం.. ఐపీఎల్ మెరుపులను జింబాబ్వే బౌలర్లకు చూపించాడు. వెల్లింగ్టన్ మసకద్జ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. ఆపై శతకం పూర్తయ్యాక మరుసటి బంతికే ఔటయ్యాడు.

టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో సెంచరీ

  • 2 ఇన్నింగ్స్‌లు: అభిషేక్ శర్మ (జింబాబ్వేపై, 2024)
  • 3 ఇన్నింగ్స్‌లు: దీపక్ హుడా (ఐర్లాండ్ పై, 2022)
  • 4 ఇన్నింగ్స్‌లు: కేఎల్ రాహుల్ (వెస్టిండీస్ పై, 2016)

టీ20ల్లో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ

  • రోహిత్ శర్మ: 35 బంతుల్లో (శ్రీలంకపై, 2017)
  • సూర్యకుమార్ యాదవ్: 45 బంతుల్లో (శ్రీలంకపై, 2023)
  • కేఎల్ రాహుల్: 46 బంతుల్లో  (వెస్టిండీస్ పై, 2016)
  • అభిషేక్ శర్మ: 46 బంతుల్లో (జింబాబ్వేపై, 2024)

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోరుచేసింది. అభిషేక్ శర్మ (100; 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీ చేయగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (77*; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), రింకు సింగ్ (48*; 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు.