IND vs ZIM: ప్రతీకారం తీర్చుకున్న యంగ్ ఇండియా.. జింబాబ్వేపై భారీ విజయం

IND vs ZIM: ప్రతీకారం తీర్చుకున్న యంగ్ ఇండియా.. జింబాబ్వేపై భారీ విజయం

తొలి టీ20 ఓటమికి యంగ్ ఇండియా బదులు తీర్చుకుంది. సొమవారం(జులై 07) హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో గిల్ సేన.. ఆతిథ్య జట్టు జింబాబ్వేను 100 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 234 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో జింబాబ్వే 134 పరుగులకు పరిమితమయ్యింది. ఈ విజయంతో భారత జట్టు ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగుల భారీ స్కోరుచేసింది. అభిషేక్ శర్మ (100; 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీ చేయగా.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (77*; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), రింకు సింగ్ (48*; 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. 

బాదుడే బాదుడు

ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌‌గా మలిచిన అభిషేక్ శర్మ.. 47 బంతుల్లోనే వంద మార్క్ చేరుకున్నాడు. 33 బంతుల్లో అర్ధశతకం సాధించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. మరో 13 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. వెల్లింగ్టన్ మసకద్జ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆపై శతకం పూర్తయ్యాక మరుసటి బంతికే ఔటయ్యాడు. అభిషేక్ వెనుదిరిగాక.. రుతురాజ్‌ గైక్వాడ్‌, రింకు సింగ్ జోడి జింబాబ్వే బౌలర్ల పని పట్టారు. వీళ్లిద్ద‌రూ బౌండ‌రీల‌తో విరుచుకుప‌డడంతో జట్టు స్కోర్ రాకెట్ వేగంతో ప‌రుగులు తీసింది. ఈ ముగ్గురి వీర‌బాదుడుతో భార‌త్.. ప్ర‌త్య‌ర్థి ముందు 236 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించగలిగింది.

జింబాబ్వే మంచి ఆరంభం

అనంతరం 235 పరుగుల ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగుల వద్ద ఆలౌటైంది. మంచి ఆరంభం దక్కినప్పటికీ.. ఆతిథ్య జట్టు బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇనోసెంట్ కియా(4) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. బెనెట్(9 బంతుల్లో 26; ఒక ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అభిషేక్‌ శర్మ వేసిన రెండో ఓవర్లో 19 పరుగులు రాబట్టాడు. అయితే, బెనెట్ ఔటయ్యాక ఆతిథ్య జట్టు పతనం మొదలైంది. డియోన్ మేయర్స్(0), క్లైవ్ మదాండే(0)లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా.. సికందర్ రజా(4), జోనాథన్ కాంప్‌బెల్(10), వెల్లింగ్టన్ మసకద్జా(1)లు నిరాశ పరిచారు. వెస్లీ మాధేవేరే(43) పోరాటం చేయడంతో ఆతిథ్య జట్టు ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. భారత బౌలర్లలో అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్ ద్వయం మూడేసి వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. 

బుధవారం మూడో టీ20 

ఈ ఇరు జట్ల మధ్య జూలై 10న బుధవారం మూడో టీ20 జరగనుంది. సిరీస్ మొత్తాన్ని ఒకే వేదికకు పరిమితం చేయడంతో.. మ్యాచ్‌లు వెంటవెంటనే నిర్వహిస్తున్నారు.