IND vs ZIM: రాణించిన జింబాబ్వే బ్యాటర్లు.. భారత్ ఎదుట ఛాలెంజింగ్ టార్గెట్

IND vs ZIM: రాణించిన జింబాబ్వే బ్యాటర్లు.. భారత్ ఎదుట ఛాలెంజింగ్ టార్గెట్

హరారే వేదికగా భారత్‌తో జరుగుతోన్న నాలుగో టీ20లో జింబాబ్వే బ్యాటర్లు పర్వాలేదనిపించారు. భారత బౌలర్లను ధీటుగా జట్టుకు పోరాడే లక్ష్యంగా అందించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికందర్ రాజా(28 బంతుల్లో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మారుమణి(32), వెస్లీ మాధవేరే(25) విలువైన పరుగులు చేశారు. 

భారత్ ముందున్న ఈ లక్ష్యం ట్రికీ టార్గెట్ అని చెప్పుకోవాలి. మన బ్యాటర్లు తొలుత బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి ముందు 200 పరుగుల లక్ష్యాలను అలవోకగా నిర్ధేశిస్తున్నా.. చేధనలో తడబడుతున్నారు. తొలి టీ20లో జింబాబ్వే నిర్ధేశించిన 115 పరుగుల టార్గెట్ ను భారత బ్యాటర్లు చేధించకపోవడం గమనార్హం. 

ఓపెనర్ల మంచి భాగస్వామ్యం

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేకి ఓపెనర్లు మారుమణి(32), వెస్లీ మాధేవేరే(25) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 63 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడి వేగంగా ఆడకపోయినా.. వికెట్లు పడనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. అదే జట్టు స్కోర్ 150 పరుగులు దాటడానికి సహాయపడింది. కెప్టెన్ సికందర్ రాజా(46; 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సిక్స్‌లు, ఫోర్లు బాదుతూ ఆతిథ్య జట్టు అభిమానుల్లో సంతోషం నింపాడు. ఇతర బ్యాటర్లు రాణించకపోవడం జింబాబ్వేని దెబ్బ తీసింది. 

భారత బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివం దూబే వికెట్ చొప్పున సాధించారు.