ఒకవైపు కుర్రకారును కట్టిపడేసే అందం.. మరోవైపు ప్రత్యర్థి జట్లకు దడపుట్టించే క్రికెట్ నైపుణ్యం. ఇది ఆసీస్ మహిళా క్రికెటర్ ఎలిస్ పెర్రీ గురుంచి ఒక్క మాటలో చెప్పదగ్గ విషయం. 2007 నుంచి ఏకధాటిగా క్రికెట్ ఆడుతున్న ఈ అందాల భామ.. ఆదివారం(జనవరి 7) భారత మహిళా జట్టుతో జరగనున్న మ్యాచ్‌తో అరుదైన ఘనత సాధించనుంది. 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆస్ట్రేలియా మహిళ క్రికెటర్‌గా అవతరించనుంది.
ఎలిస్ పెర్రీకి క్రికెట్‌లో తిరుగులేదు. ఆమె మైదానంలోకి వస్తే అభిమానులు స్టేడియానికి పోటెత్తుతారు. అలా అని తన అందం చూసి వస్తారనుకోకండి. తన ఆట తీరు అలాంటిది. నిఖార్సైన పేస్, మిడిలార్డర్‌లో హిట్టింగ్‌తో మోస్ట్ ప్రామినెంట్ క్రికెటర్ తాను. నిలకడగా బ్యాటింగ్ చేయడంలోనూ తనకు తానే సాటి. మైదానంలో తాను ఏమాత్రం అలసిపోదు. భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలా ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంది.
నేటితో 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు పూర్తిచేసుకున్న పెర్రీ.. 400 మ్యాచ్‌లు ఆడటమే తన లక్ష్యమంటోంది. ఫిట్‌గా ఉన్నంతకాలం తాను క్రికెట్ లో కొనసాగుతానని తెలిపింది. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుపెట్టిన పెర్రీ.. ఇప్పటివరకూ 141 వన్డేలు, 146 టీ20లు, 12 టెస్టులు ఆడింది.
అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళా క్రికెటర్లు
- మిథాలీ రాజ్(భారత్): 333 మ్యాచ్‌లు
- షార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్), సుజీ బేట్స్ (న్యూజిలాండ్): 309 మ్యాచ్‌లు
- ఎల్లిస్ పెర్రీ (ఆస్ట్రేలియా): 299 మ్యాచ్‌లు