- ఫీల్డింగ్‌పై ఫోకస్
- రా. 7 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో లైవ్
నవీ ముంబై: వెస్టిండీస్‌తో తొలి టీ20లో ఘన విజయం సాధించిన ఇండియా విమెన్స్ టీమ్ ఇప్పుడు సిరీస్‌పై గురి పెట్టింది. మంగళవారం (డిసెంబర్ 17) జరిగే రెండో మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. అదే సమయంలో మొదటి టీ20లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ఫీల్డింగ్‌ను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ అయిన తర్వాత విండీస్‌పై ఇండియా మెరుగైన పెర్ఫామెన్స్ చేసింది.
బ్యాట్‌తో జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన.. బాల్‌తో టిటాస్, దీప్తి, రాధా యాదవ్ సత్తా చాటారు. రెండో మ్యాచ్‌లో మిగతా ప్లేయర్లు కూడా రాణించాలని చూస్తున్నారు. అయితే, గత పోరులో ఇండియా ఫీల్డింగ్ నాసిరకంగా కనిపించింది. మంధాన, జెమీమా, సైమా సింపుల్ క్యాచ్‌లను కూడా డ్రాప్ చేశారు. ఈ నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా విండీస్‌పై వరుసగా పదో విక్టరీ సాధించాలని హర్మన్‌సేన కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు ఫస్ట్ మ్యాచ్‌లో తేలిపోయిన కరీబియన్ టీమ్ ఇందులో నెగ్గి సిరీస్ రేసులో నిలవాలని కోరుకుంటోంది.