- ఫైనల్లో 10 వికెట్ల తేడాతో లంక చిత్తు
- మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా సూపర్ షో
హైదరాబాద్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఆసియా కప్‌లో అద్భుతం చేశాడు..! సీమ్, స్వింగ్, బౌన్స్ తో శ్రీలంక బ్యాటింగ్‌ను పేకమేడలా కూల్చాడు..! ఒకే ఓవర్‌లో నాలుగు, మొత్తంగా ఆరు వికెట్లు తీసి లంకను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు..! దీంతో గత రికార్డులను బద్దలుకొడుతూ.. వన్డే వరల్డ్ కప్‌కు ముందు బలమైన ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపుతూ రికార్డు స్థాయిలో ఇండియాకు ‘ఎనిమిదోసారి’ ఆసియా కప్‌ను అందించాడు..!!
కొలంబో: ఆసియా కప్‌లో టీమిండియా అదరగొట్టింది. బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ (6/21), హార్దిక్ పాండ్యా (3/3) ముప్పేటా చేసిన దాడిలో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక బెంబేలెత్తిపోయింది. ఫలితంగా ఆదివారం ఏకపక్షంగా సాగిన టైటిల్ ఫైట్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసి ఎనిమిదోసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకుంది. 2018లో చివరిసారి విన్నర్‌గా నిలిచిన ఇండియా.. ఐదేళ్ల తర్వాత తొలిసారి మల్టీ నేషన్ ట్రోఫీని కైవసం చేసుకుంది. వర్షం వల్ల 40 నిమిషాలు ఆలస్యంగా మొదలైన ఫైనల్లో టాస్ గెలిచిన శ్రీలంక 15.2 ఓవర్లలో 50 రన్స్‌కే ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (17)టాప్ స్కోరర్. తర్వాత ఇండియా 6.1 ఓవర్లలో 51/0 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ (23 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (27 నాటౌట్) విజయాన్ని అందించారు. తాజా విజయంతో 2000 చాంపియన్స్ ట్రోఫీలో లంక చేతిలో 54 రన్స్‌కే ఆలౌటైన ఇండియా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. ఆరు వికెట్లతో చెలరేగిన మహ్మద్ సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, కుల్దీప్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డులు లభించాయి.
సిరాజ్ ‘సిక్సర్’
తొలి ఓవర్ మూడో బాల్‌కే బుమ్రా (1/23).. కుశాల్ పెరీరా (0)ను క్యాచ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సిరాజ్ లెంగ్త్‌ను మారుస్తూ సరైన ప్రదేశాల్లో బాల్స్ వేస్తూ ముప్పు తిప్పలు పెట్టాడు. 4వ ఓవర్‌లో మొదలైన సిరాజ్ వికెట్ల విధ్వంసం తన ఏడో ఓవర్‌లో ముగిసినా.. మధ్యలో వేసిన రెండు ఓవర్లలోనే ఆరు వికెట్లు తీయడం అద్భుతం. ఫోర్త్ ఓవర్ ఫస్ట్ బాల్‌కు పాథుమ్ నిశాంక (2), థర్డ్ బాల్‌కు సమరవిక్రమ (0), ఫోర్త్ బాల్‌కు అసలంక (0), లాస్ట్ బాల్‌కు ధనంజయ్ డిసిల్వ (4)ను పెవిలియన్‌కు పంపాడు.
Also Rard: ది ఫాలెన్ కింగ్డమ్ నిజాం బుక్ రిలీజ్
ఈ నాలుగు బాల్స్‌ను నాలుగు భిన్నమైన యాంగిల్స్‌లో సంధించడం సిరాజ్ బౌలింగ్ బ్యూటీకి నిదర్శనం. తన తర్వాతి ఓవర్‌లో వేసిన రెండు ఫుల్ లెంగ్త్ బాల్స్‌కు కెప్టెన్ దాసున్ షనక (0), కుశాల్ మెండిస్ వికెట్లు ఇచ్చుకున్నారు. ఇందులో షనక ఔటైన ఔట్ స్వింగర్ మ్యాచ్‌కే హైలెట్. ఇక 33/7తో ఎదురీత మొదలుపెట్టిన లంకను హార్దిక్ మరింత దెబ్బకొట్టాడు. కేవలం 14 బాల్స్‌లోనే దునిత్ వెల్లాలగె (8), ప్రమోద్ మధుషన్ (1), మతీషా పతిరణ (0)ను ఔట్ చేసి లంకను 50 రన్స్‌కే పరిమితం చేశాడు.
మన డెస్టినీ (విధి)లో ఏం రాసిందో అదే జరుగుతుంది. ఈ రోజు ఆరు వికెట్ల ఘనత నాకు రాసి పెట్టింది. చివరిసారి త్రివేండ్రంలో లంకతోనే జరిగిన మ్యాచ్‌లో నేను నాలుగు వికెట్లు తీశా. ఐదోది సాధించలేకపోయా. కానీ ఈ రోజు పెద్దగా ప్రయత్నించకపోయినా నాకు దక్కింది. నేనెప్పుడూ వైట్‌బాల్ క్రికెట్‌లో స్వింగ్ కోసం వెతుకుతాను. గత మ్యాచ్‌ల్లో దాని కోసం పెద్దగా ప్రయత్నించలేదు. ఈ రోజు ప్రయత్నించి సక్సెస్ అయ్యా. ఔట్ స్వింగర్స్‌తో నేను ఎక్కువ వికెట్లు తీశాను. ఈ పిచ్‌పై బ్యాటర్‌ను ఫ్రంట్‌ఫుట్ ఆడేలా చేసి వికెట్లు సాధించా. నా పెర్ఫామెన్స్ చాలా సంతోషాన్నిచ్చింది.
‑ సిరాజ్
ఓవైపు బాల్‌తో విధ్వంసం సృష్టించిన సిరాజ్.. మరోవైపు తన పనితో పెద్ద మనసును చాటుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కింద తనకు వచ్చిన 5 వేల డాలర్లను గ్రౌండ్ స్టాఫ్‌కు అందజేశాడు. వర్షం ఆగినప్పుడల్లా వీలైనంత త్వరగా గ్రౌండ్‌ను సిద్ధం చేసేందుకు స్టాఫ్ చాలా శ్రమించారని సిరాజ్ కితాబిచ్చాడు. ఇక గ్రౌండ్ స్టాఫ్ పనికి మెచ్చిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) కూడా 50 వేల డాలర్లను బహుకరించింది. దీనికి సంబంధించిన చెక్‌ను జై షా అందజేశారు.