- ఇందారం బ్రిడ్జిని ఖాతాలో వేసుకున్న అధికార పార్టీ లీడర్లు
- పనులు పూర్తి కాకుండానే బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
- వాహనదారుల అవస్థలు
మంచిర్యాల, వెలుగు: ‘సొమ్ము సింగరేణిది, సోకు సర్కారుది’ అన్నట్టుంది ఇందారం ఓవర్ బ్రిడ్జి నిర్మాణ వ్యవహారం. సింగరేణి తమ అవసరాల కోసం రాజీవ్ రహదారిపై నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిని.. పనులు పూర్తి కాకుండానే మంత్రులు హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, బాల్క సుమన్ ప్రారంభించి తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రారంభం రోజు ఒక్కనాడే వెహికల్స్ తిరిగాయి. ఒక్కరోజు హడావుడి చేసినా పనులు మాత్రం నేటికీ కొనసాగిస్తున్నారు. సింగరేణి సంస్థ నిధులతో కడుతున్న బ్రిడ్జిని బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకోవడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మరోవైపు వందలాది వాహనాలు సర్వీస్ రోడ్డుపై వెళ్లడంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పటికే జరిగిన ప్రమాదాలు ముగ్గురు చనిపోయారు.
పనిలో పనిగా ప్రారంభం..
ఇందారంలోని రాజీవ్ రహదారికి ఒక వైపు ఓసీపీ ఉండగా, అందులో నుంచి తీసిన మట్టిని సింగరేణి లారీల్లో మరొక వైపు తరలిస్తుందిలారీలు రాజీవ్ రహదారిని దాటేందుకు ప్లైఓవర్ బ్రిడ్జి కట్టాలని నిర్ణయించింది.
బ్రిడ్జి పూర్తయితే పైనుంచి రాజీవ్ రహదారి, కింది నుంచి సింగరేణి లారీలు సులువుగా వెళ్తాయి. దీని కోసం సింగరేణి రూ.37.50 కోట్లతో పనులను స్టార్ట్ చేసింది. 900 మీటర్ల పొడవు బ్రిడ్జి, దానికి 700 మీటర్ల పొడవు సర్వీస్ రోడ్లు వేస్తోంది. ఇది పూర్తిగా సింగరేణి అవసరాల కోసం ఆ సంస్థ ఫండ్స్‌తో నిర్మిస్తున్నదే. రాజీవ్ రహదారిపై ప్రయాణించే వారికి సంబంధం లేదు. అయితే ఈ నెల 15న నియోజకవర్గంలో సమారు రూ.200 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి హరీశ్ రావు పనిలో పనికిగా ఈ బ్రిడ్జిని కూడా ప్రారంభించి, ఆర్భాటం చేశారు.
యాక్సిడెంట్లకు బాధ్యులెవరు?
బ్రిడ్జి పనులు కొనసాగుతుండటంతో రాజీవ్ రహదారి మీదుగా వచ్చిపోయే వాహనాల కోసం సర్వీస్ రోడ్డు వేశారు. ఈ రోడ్డుపై నిత్యం వందల సంఖ్యలో హెవీ వెహికల్స్, ఇసుక లారీలు ఈ నడుస్తున్నాయి. దీంతో ఈ రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్ సరిగా నీళ్లు కూడా చల్లకపోవడం వల్ల పెద్ద ఎత్తున దుమ్మ లేస్తోంది. కిలోమీటరు దూరం ప్రయాణానికే నానా అవస్థులు ఎదరువతున్నాయని వాహనదారులు అంటున్నారు. దుమ్ము లేవడం వల్ల రోడ్డుపై గుంతలు, వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యం ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నిరుడు మే నెలలో ఐదు రోజుల వ్యవధిలో రెండు యాక్సిడెంట్లు జరిగాయి. లారీలు ఢీకొని బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తతో పాటు మరో వ్యక్తి చనిపోయాడు. సింగరేణి అధికారులు, బ్రిడ్జి కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను తీస్తోందని స్థానిక ప్రజలు అంటున్నారు.