మండల పరిషత్​, మున్సిపాలిటీల్లో..అవిశ్వాస సెగలు

  •     గత ప్రభుత్వం లో అప్పుల పాలైన  ఎంపీటీసీలు
  •     అవిశ్వాసలు పెడుతున్నపాలక వర్గ సభ్యులు 
  •     నిధుల మంజూరు జాప్యంతో బీఆర్ఎస్ లోనూ అసంతృప్తులు
  •     పాలకవర్గాల ఏర్పాటుకు పావులు కదుపుతున్న కాంగ్రెస్ నేతలు.
  •     ఇప్పటికే మల్యాల, వెల్గటూర్ ఎంపీపీలపై అవిశ్వాసాలు

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లాలోని స్థానిక సంస్థల్లో అవిశ్వాస తీర్మానాలు రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థలకు ప్రధాన్యం దక్కకపోడంతో లీడర్లు అసంతృప్తిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి అభివృద్ధి పనులకు గ్రీన్​ సిగ్నల్​ ఉన్నా.. నిధులు రాకపోవడంతో లీడర్లు ఇబ్బందులు పడ్డారు. మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి నానా అవస్థలు పడ్డారు. నిధుల విడుదలో ఆలస్యం జరిగినా  అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరి పనులు పూర్తి చేశారు. కొందరు వడ్డీలకు వడ్డీలు కట్టి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారు.

మరి కొందరైతే తమ భూముల్లో కొంత భాగం అమ్మి అప్పులు కట్టాల్సి వచ్చింది. ఎమ్మెల్యే, మంత్రి స్థాయి ప్రజాప్రతినిధులను ఎంతగా బతిమిలాడినా.. ప్రభుత్వాన్ని వేడుకున్నా నిధులు మాత్రం రాలేదు. అయినప్పటికీ పలు సందర్బాల్లో కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు వినతులు.. నిరసనలు తెలియజేసినా ఫలితం లేక పోయింది. ప్రత్యక్షం గా సర్కార్ తో పోరాడేందుకు చాలా మంది భయపడ్డారు. నిధులు ఆపి ఇబ్బందులకు గురిచేస్తారని నోరు విప్పలేదు.

ప్రభుత్వం మారడంతో..  

గత సర్కార్ హయాం లో ఇబ్బందులు పడ్డవారందరూ..ఏకమై అవిశ్వాసాలను తెరపైకి తెస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర సభ్యులంతా కలిసి బల నిరూపణ కోసం సవాల్ విసురుతున్నారు. ఇటివల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి  కాంగ్రెస్ లో చేరడం తో స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ బలం పుంజుకుంది. దీంతో అవిశ్వాసాలు కొనసాగుతున్నాయి.  స్థానిక సంస్థల పాలకవర్గాల్లో తమ నేతలకు పీఠం దక్కేలా కాంగ్రెస్​ సీనియర్లు పావులు కదుపుతున్నారు.

మరి కొన్ని చోట్ల బీఆర్ఎస్ లోని ఆసంతృప్తులతో పాటు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులంతా ఒక్కటై ఆవిశ్వాసలు పెడుతున్నారు. వీటితో పాటు కాంగ్రెస్ బలం పుంజుకున్న మున్సిపాలిటిల్లోనూ ఆవిశ్వాసాలు పెట్టేందుకు కౌన్సిలర్లు కూడా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అభివృద్ధి కోసం ఆవిశ్వాసాలు పెట్టి స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధులు నిధులు సేకరించే పని లో పడ్డారు. 

మల్యాలలో.. 

ఈ నెల 20 మల్యాల బీఆర్ఎస్ ఎంపీపీ చెందిన మిట్టపల్లి విమల పై 10 మంది ఎంపీటీసీలు అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టి ఆర్డీవోకు అందజేశారు. మండలం లో 14 ఎంపీటీసీ స్థానాల్లో బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 2, బీజేపీ 3,  ఒక స్వతంత్ర్య ఎంపీటీసీ   ఉన్నారు. ఇటీవల ఎన్నికల సమయం లో బీఆర్ఎస్ కు చెందిన మల్యాల ఎంపీటీసీ 1 ఆగంతపు రవళి, రామన్నపేట ఎంపీటీసీ సఫియా బేగం కాంగ్రెస్ లో చేరగా

పోతారం స్వతంత్ర ఎంపీటీసీ గంగాధర్ బీజేపీ లో చేరారు. 10 మంది ఎంపీటీసీలు తీర్మానంపై సంతకం చేసి ఆర్డీఓకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడం తో ఎంపీపీ పదవి కాంగ్రెస్ కు చెందిన మల్యాల ఎంపీటీసీ- 1 ఆగంతపు రవళికి అవకాశం కల్పించేలా నేతల నుంచి  పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

వెల్గటూరులో అదే..

ఈ నెల 11 న వెల్గటూర్ బీఆర్ఎస్ ఎంపీపీ కూన మల్ల లక్ష్మి పై పది మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మండలం లో 15 ఎంపీటీసీ స్థానాలుండగా.. కాంగ్రెస్ ఎంపీటీసీల బలం 9 కి చేరింది. అలాగే బీఆర్ఎస్ అసంతృప్తి నేత కొత్త పేట్ ఎంపీటీసీ నక్కపూజిత కూడా అవిశ్వాసానికి  మద్దతు ఇస్తూ సంతకం చేశారు. ఈ మేరకు ఇండిపెండెంట్ ఎండపల్లి ఎంపీటీసీ జాడి సుజాత కు అవకాశం కల్పించేలా కాంగ్రెస్ నేతలు  ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.