విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. నిర్మల్ జిల్లాలో ఇద్దరు టీచర్ల సస్పెన్షన్

విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. నిర్మల్ జిల్లాలో ఇద్దరు టీచర్ల సస్పెన్షన్
  • నిర్లక్ష్యంగా ఉన్న హెచ్ఎంపైనా వేటు 
  • ఉత్తర్వులు జారీ చేసిన నిర్మల్ డీఈవో

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో టెన్త్ స్టూడెంట్స్ తో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లతో పాటు నిర్లక్ష్యంగా ఉన్న హెచ్ఎం సస్పెండ్ అయ్యారు. సోమవారం కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు డీఈఓ రామారావు ఉత్తర్వులు జారీ చేశారు. మ్యాథ్స్ టీచర్ మనోహ ర్ రెడ్డి, ఇంగ్లీష్ టీచర్ మోహన్ రావు కొద్ది రోజులుగా టెన్త్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా  వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

  విద్యార్థినులు తమ పేరెంట్స్ కు తెలుపగా..  రెండు రోజుల కింద  స్కూలుకు వెళ్లి టీచర్లను నిలదీసి వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా టీచర్ల తీరుపై హెడ్మాస్టర్ కిషన్ రావుకు కూడా  ఫిర్యాదు చేసినా స్పందించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. దీంతో కలెక్టర్,  డీఈఓకు కంప్లయింట్ చేశారు. డీఈఓ రామారావు  విచారణ చేసి మనోహర్ రెడ్డి, మోహన్ రావు, కిషన్ రావును సస్పెండ్ చేశారు. 

అదేవిధంగా టీచర్లపై పోక్సో కేసుతో పాటు అట్రాసిటి కేసులు పెట్టాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్ నాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ డిమాండ్ చేస్తూ.. ఎస్పీ జానకి షర్మిలకు కంప్లయింట్ చేశారు. కాగా.. స్కూల్ అసిస్టెంట్ మనోహర్ రెడ్డి పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఆయన పనిచేసిన స్కూల్ లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారని పేరెంట్స్ ఫిర్యాదులు కూడా చేశారు.