హాస్టల్​ కార్మికుల నిరవధిక సమ్మె

భద్రాచలం/గుండాల/ఇల్లెందు,వెలుగు :  జిల్లాలోని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే పోస్టుమెట్రిక్​ హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేసే కార్మికులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. పోస్టుమెట్రిక్​ హాస్టళ్లు 30, ఆశ్రమ పాఠశాలలు,హాస్టళ్లు కలిపి 60 వరకు ఉన్నాయి. వీటిల్లో సుమారు 400 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గత 18 నెలలుగా వేతనాలు రావడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి తమ సమస్య చెప్పుకున్నా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక సమ్మెకు దిగారు.

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మాచారి ఆధ్వర్యంలో డీడీ మణెమ్మను కలిసి వినతిపత్రం ఇచ్చారు. గిరిజన కార్మికుల ఆకలి కేకలు వినాలని వారు కోరారు. క్యాటరింగ్​ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ సమ్మెలో నాగరాజు, హాస్టల్ వర్కర్స్ యూనియన్​ జిల్లా కార్యదర్శి హీరాలాల్, రామారావు, సుభద్ర, శ్యామల

నాగమణి, ఆదిలక్ష్మీ, కాంతమ్మ, దర్మమ్మ, రామయ్య,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు సమ్మెకు దిగడంతో పలు హాస్టళ్లలో విద్యార్థులే వంటలు చేసుకున్నారు. సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు.