షరతులు లేకుండా పర్మినెంట్ చేయాలి.. కలెక్టరేట్ ముందు సెకండ్ ఏఎన్ఎంల సమ్మె

ఆసిఫాబాద్, వెలుగు: సెకండ్ ఏఎన్ఎంలను ఎలాంటి షరతులు లేకుండా పర్మినెంట్ చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు. ఈసందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సెకండ్ ఏఎన్ఎంలతోపాటు, ఈసీ, అర్బన్ ఆర్​బీఎస్కే,104 ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 

20 ఏండ్ల నుంచి చాలీచాలని జీతాలు తీసుకుంటూ ప్రభుత్వానికి పనిచేస్తూ శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ చేసే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్,సెకండ్ ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జంపాల వసంత, జిల్లా అధ్యక్షురాలు సంతోషి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.