ఈ దురాగతాలకు బాధ్యత ఎవరిది?

ఈ దురాగతాలకు బాధ్యత ఎవరిది?

అమ్నేషియా పబ్ ఘటన మరవక ముందే మరో రెండు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆడపిల్లలున్న తల్లిదండ్రులను ఇవి కలవరపెడుతున్నాయి. రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనల్లో మైనర్ల భాగస్వామ్యం పెరుగుతోందన్న విషయం వణికిస్తోంది. మరి ఈ సంఘటనలకు ఎవరిని తప్పు పట్టాలనేదే అసలు ప్రశ్న. తాజా ఘటనలు మైనర్లు అనే పదానికి నిర్వచనం, అర్థం మార్చాలేమో అనే కొత్త వాదనలకు తెర లేపేలా ఉన్నాయి.  ప్రపంచం సాంకేతికంగా ఎంత ఎదిగినా ఆడవాళ్లకు ఇచ్చే స్థానం, విలువ ఏమాత్రం ఎదగలేదు. పైగా ఆమెను మరింత విలాస వస్తువుగా చూపడం, చూడటం పెరుగుతోంది. భావితరాలకు ఇవే విలువలను నిర్వచనాలు అందిస్తున్నాయి భూత, వర్తమాన తరాలు. గత రెండు దశాబ్దాల్లో  మహిళలపై హింస 70 శాతం పెరిగిందని, నిర్భయ ఘటన తర్వాత స్త్రీలపై జరిగే అత్యాచారాల కేసుల నమోదు గణనీయంగా పెరిగిందని ఎన్సీఆర్బీ సహా పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వెల్లడిస్తున్నాయి. 2019 కన్నా 2020లో నేరాల సంఖ్య తగ్గిందని, అందుకు కారణం కరోనా లాక్ డౌన్ అని, ఇదే కాలంలో గృహహింస కేసులు గణనీయంగా నమోదైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే అత్యాచారానికి గురైన వారి సంఖ్య కూడా పెరిగింది. అత్యాచారాలు 27(2019) శాతం నుంచి 37(2020) శాతానికి పెరగడానికి కారణం తెలిసిన వ్యక్తులే నిందితులుగా ఉండటం. అత్యాచారానికి పాల్పడిన వారిలో బాధితురాలికి తెలిసిన వారే 90 శాతం ఉంటున్నారు.

తెలిసిన వారి నుంచే ముప్పు
నగరంలో జరిగిన, జరుగుతున్న అత్యాచార ఘటనల్లో నిందితులు తోటి విద్యార్థులు, అదే వీధిలో ఉంటున్న వాళ్లు, ఫేస్ బుక్ లో పరిచయమైన వారు, కుటుంబ పరిచయస్తులు, డ్రైవర్లు, బయట వ్యక్తులు ఉంటున్నారు. అయితే వాటిల్లో  మైనర్లు సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 10, 12,17 ఏండ్ల వయసు పిల్లలు తెలిసి చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? హైస్కూల్, ఇంటర్మీడియట్ తరగతుల్లోనే ఉన్న వీరిని తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదా, ఏం చేసినా బయటకు తీసుకురావడానికి మేము, మా హోదాలున్నాయిలే అని భరోసా ఇవ్వడమా?  ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ‘భడవకు నాలుగు తగిలించండి’ అని టీచర్లకు తల్లిదండ్రులు చెప్పే రోజులు పోయి, ‘ఏరా మా పిల్లలకు భయ భక్తులు చెప్తావా, మేము చెప్పుకుంటాంలే’ అని పిల్లల ముందే అధ్యాపక వ్యవస్థను చులకన చేసే తల్లి దండ్రుల ప్రవర్తన ఇలాంటి దురాగతాలకు బాధ్యత వహించాల్సిందే. ‘బట్టి కొట్టించడమే మా బాధ్యత.. వారి వ్యక్తిత్వాలకు మా బాధ్యత లేదు’ అని అధ్యాపక వ్యవస్థ చేతులు దులుపుకోవడం కూడా మరొక కారణం. పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేలా పాఠాలు చెప్పే స్కూళ్లే మాయమైపోయాయి. స్కూల్ వాళ్లే ఓ పబ్ లో పార్టీ నిర్వహించడం విద్యా విధానంలోనే దిగజారుడుతనానికి పరాకాష్ట.

తల్లిదండ్రుల బాధ్యత ఎంత? 
ఇయ్యాల రేపు భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం గడుస్తోంది. ఉద్యోగ బాధ్యతల్లో ఉండే తల్లిదండ్రులు పిల్లల యోగక్షేమాలు మొబైల్ ఫోన్ల ద్వారా తెలుసుకుంటారు. దూరంగా ఉండే స్కూళ్లకు వెళ్లి వచ్చేదాకా భయమే. సదుద్దేశంతో వారికిచ్చే మొబైల్ ఫోన్లు వారి ఒంటరితనానికి మంచి మార్గాలు కాకపోగా, దుర్మార్గాలకు పరోక్షంగా కారణమవుతున్నాయి. 24 గంటలు నెట్ అందుబాటులో ఉంటే పిల్లలు అందులో ఏం చూస్తున్నారో తెలియదు. ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేసే బ్లాగులను బ్లాక్ చేసి ఇస్తున్నారు?  మరి ఇది పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యతారాహిత్య౦ కాదా? పైగా తల్లిదండ్రులు వారి ఆర్థిక, రాజకీయ లేదా ఇతర హోదాల గురించి పిల్లల ముందు ఎక్కువగా చెప్పుకోవడం వారిలో నేర ప్రవృత్తిని పెంచుతోందని, పిల్లలు ఏంచేసినా మేమున్నామని చిన్నప్పటి నుంచే వారిలో అహంకారాన్ని పెంచడం వల్ల కూడా అవి రేప్​లాంటి ఘటనలకు దారి తీస్తున్నాయనేది విశ్లేషకుల మాట. 

మైనర్లు అయితే... 
రాజ్యాంగం ప్రకారం18 ఏండ్ల లోపు వారు మైనర్లు. కానీ ఇప్పటి పిల్లలు ఓవర్ మెచ్యూరిటీతో ఉన్నారనేది వాస్తవం. చాలా విషయాల పట్ల వారిలో ఓ క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీకి సమాధానం ఇచ్చేలా అవగాహన పర్చేలా విద్యావ్యవస్థ లేదు. అన్నింటికీ దారి ‘నెట్’ అన్నట్టుగా మన బతుకులు ఉన్నాయి. నిర్భయ నుంచి దిశ వరకు మైనర్ల క్రూరత్వం ఎలా ఉందో మనకు తెలుసు. అమ్నేషియా పబ్ కేసులో కూడా మైనర్ల పాత్రే ఎక్కువగా కనిపిస్తోంది. మైనర్ అన్న పేరుతో శిక్షల నుంచి మినహాయింపులు ఇస్తారు. జువైనల్ హోమ్ కు పంపిస్తారు. పోనీ అక్కడేమైనా సత్ప్రవర్తన వస్తుందా? తెచ్చే సిబ్బంది అక్కడ ఉన్నారా? వాళ్లు హోం నుంచి వచ్చాక ఇదే తల్లిదండ్రుల దన్నుతో మరిన్ని నేరాలకు పూనుకోరనే హామీ న్యాయవ్యవస్థ, లేదా ప్రభుత్వాలు, తల్లిదండ్రులు ఇవ్వగలరా? ఇవన్నీ ప్రశ్నలే. 

శిక్షలు ఎవరికి పడుతున్నయ్​?
అత్యాచార ఘటనల్లో పేరు ప్రఖ్యాతులు,రాజకీయ, ఆర్థిక అండదండలు ఉన్న వారు శిక్షల నుంచి చాలా సులభంగా తప్పించుకుంటున్నట్లు ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దళితులు, ముస్లింలు, గిరిజనులు ఎక్కువగా జైళ్లకు వెళ్తున్నారు. ఈ పది రోజుల్లో హైదరాబాద్​నగరంలో జరిగిన మూడు ఘటనల్లో అమ్నేషియా పబ్ మైనర్లు, ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన నిందితులు, ఓ చిన్న షాపులో పనిచేస్తున్న వ్యక్తి.  వీరిలో ఎవరికి ఎలా శిక్షలు పడతాయి? ఎంత వేగంతో కేసులు కొలిక్కి వస్తాయి? అసలు నిందితులు కేసులో ఉంటారా? తప్పిస్తారా అనేది చూడాల్సిందే. -పండలనేని గాయత్రి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్