డ్రెస్సింగ్ విషయంలో ప్రధాని మోదీ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, ఎంత శ్రద్ద చూపిస్తారో.. ఆయన విదేశీ పర్యటనలు, సమావేశాలు, జాతీయ పండగల్లో ఆయన ధరించే వేషధారణను చూస్తేనే అర్థమవుతుంది. ఏ వేడుకలోనైనా ప్రధాని పాల్గొంటున్నారంటే.. వెంటనే అందరి దృష్టీ ఆయన వేసుకునే దుస్తులు, తలపాగాపైనే ఉంటుంది. ఆయన ఈ సారి ఎలాంటి డ్రెస్సింగ్ లో కనిపిస్తారు అని అంతా ముందే చర్చించుకుంటూ ఉంటారు. అందరి అంచనాలను నిజం చేస్తూ ప్రధాని వినూత్న రీతిలో కనిపించి అందర్నీ ఆకట్టుకోవడం కొత్తేం కాదు. ఎప్పటిలాగే ఈ సారి కూడా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ వేషధారణ, తలపాగాలపై చర్చలు కొనసాగాయి. ప్రతి సంవత్సరం ప్రధాని మోదీ.. భారతదేశం సంస్కృతి, వైవిధ్యానికి ప్రతీకగా ఉండే సాంప్రదాయ రూపంలో కనిపించడం చూస్తూనే ఉంటారు. అలాగే ఈ ఏడాది కూడా ఆయన భిన్న రీతిలో ప్రజలకు దర్శనమిచ్చారు. ఈ 77వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ.. రాజస్థానీ తరహాలో రంగురంగుల తలపాగాను ధరించారు.
ఆఫ్-వైట్ కుర్తా, తెలుపు ప్యాంటు.. నెహ్రూ జాకెట్‌తో ప్రధాని మోదీ తలపాగాతో ఆకర్షించారు. ఈ తలపాగా ముందు భాగంలో అశోక్ చక్రంతో ప్రముఖ రాజస్థానీ బంధాని ముద్రణను కలిగి ఉంది. ఈ రోజు యావత్ దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నందున, ఇన్నేళ్లలో ప్రధానమంత్రి మోదీ ధరించిన సాంప్రదాయ తలపాగాలను మరొకసారి సందర్శిద్దాం.
2014
స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధానిగా మొదటిసారిగా కనిపించారు. ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉన్న జోధ్‌పురి బంధేజ్ తలపాగాను మోదీ ధరించారు. ఈ తలపాగాకు చివరి భాగంలో ఆకుపచ్చ అంచు డిజైనింగ్ కూడా ఉంది.
2015
69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎరుపు, నీలం రంగులతో కూడిన పసుపు రంగు తలపాగా ధరించారు. దానికి లేత గోధుమరంగు కుర్తా, జాకెట్‌తో జత చేసి అందర్నీ ఆకట్టుకున్నారు.
2016
2016లో గులాబీ, ఎరుపు, పసుపు షేడ్స్‌లో ఉన్న డై టర్బన్‌ను మోదీ ధరించారు. ఇది పొడవాటి తలపాగాను ఉండగా.. దీనికి తెల్లటి కుర్తాను జత చేశారు.
2017
71వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకాశవంతమైన పసుపు, ఎరుపు రంగు వస్త్రంపై గోల్డెన్ కలర్ గీతలతో ఉన్న తలపాగాతో కనిపించారు.
2018
72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ కుంకుమపువ్వు రంగులో ఉన్న తలపాగా ధరించారు.
2019
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, రాజస్థాన్ సంప్రదాయాన్ని ప్రతిబింబించే పసుపు తలపాగాలో ప్రధాని మోదీ కనిపించారు. దాంతో పాటు, హాఫ్ స్లీవ్ కుర్తా, చురీదార్ ను మోదీ ధరించారు.
2020
కొవిడ్-19 కాలంలో, పీఎ మోదీ కుంకుమపువ్వు, లేత గోధుమరంగు సఫాను ఎంచుకున్నారు. దీనికి తలపాగా, పాస్టెల్ షేడ్ హాఫ్-స్లీవ్ కుర్తాను జత చేశారు.
2022
గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ.. త్రివర్ణ పతాకంతో ముద్రించిన తెల్లటి తలపాగా ధరించారు. తలపాగాతో పాటు, ఆయన సంప్రదాయ తెల్లటి కుర్తా పైజామా సెట్, నీలిరంగు నెహ్రూ కోటు ధరించారు.