మునుగోడులో ఇండిపెండెంట్ అభ్యర్థుల వినూత్న ధర్నా

మునుగోడు ఉప ఎన్నిక సమయం దగ్గర పడటంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. సేవ్ డెమోక్రసీ -సేమ్ మునుగోడు  ప్ల కార్డులతో  చండూర్ ఆర్వో కార్యాలయం ముందు  ఇండిపెండెంట్ అభ్యర్థుల ధర్నా నిర్వహించారు.  బీజేపీ,టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మునుగోడు నియోజకవర్గంలో  మద్యం,డబ్బులు విచ్చల విడిగా పంచుతున్నా ఎన్నికలు అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేశారు. మునుగోడు బైపోల్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు మునుగోడు ఉపఎన్నిక పోలింగ్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో 2.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారని.. 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. అర్భన్లో 35, రూరల్లో 263 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  

మునుగోడు నియోజకవర్గంలో 5686 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉంటే.. 739 మంది మాత్రమే అప్లై చేసుకున్నారని వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తైందన్నారు. 1192 మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. మంగళవారం సాయంత్రం తర్వాత బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం ఉన్నట్లు వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి సహా ముగ్గురు అధికారులు ఉంటారని తెలిపారు. పోలింగ్ ఏజెంట్లు గంట ముందే సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.