సల్మాన్​కు దూరంగా ఉండు.. లేదంటే చంపేస్తం

సల్మాన్​కు దూరంగా ఉండు..  లేదంటే చంపేస్తం
  • బిహార్ ఎంపీ పప్పూ యాదవ్​కు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

పాట్నా: బిహార్ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ను చంపుతామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఇష్యూకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ‘‘నీ కదలికలను మేం నిశితంగా పరిశీలిస్తున్నాం. మా హెచ్చరికలను పట్టించుకోకపోతే చంపేస్తాం” అని బెదిరించింది. పప్పూ యాదవ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడగా, ఆ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. 

‘‘భాయ్ (లారెన్స్ బిష్ణోయ్) జైల్లో సిగ్నల్ జామర్లను నిలిపివేసేందుకు గంటకు రూ.లక్ష చెల్లించి, నీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ నువ్వు ఆ కాల్స్ ను పట్టించుకోవడం లేదు. వీలైనంత త్వరగా భాయ్ తో సెటిల్ మెంట్ చేసుకో. నేను నిన్ను ఒక పెద్దన్నగా భావించాను. కానీ నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు. నువ్వు తిరిగి కాల్ చెయ్.. భాయ్ తో మాట్లాడిస్తాను” అని పప్పూ యాదవ్ ను బెదిరించినట్టుగా ఆడియోలో ఉంది. కాగా, ఎన్సీపీ లీడర్ బాబా సిద్ధిఖీ హత్య తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్ ను అంతం చేస్తానని పప్పూ యాదవ్ సవాల్ విసిరారు. అలాగే సల్మాన్ ఖాన్ కు అండగా ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి.

జెడ్ సెక్యూరిటీ ఇవ్వాలని లేఖ.. 

 బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో తనకు సెక్యూరిటీ పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పప్పూ యాదవ్ కోరారు. ఈమేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిహార్ సీఎం, డీజీపీకి లేఖ రాశారు. ఈ నెల 21వ తేదీతో ఉన్న ఆ లేఖ.. సోమవారం బయటకు వచ్చింది. ‘‘నా సెక్యూరిటీని వై కేటగిరీ నుంచి జెడ్ కేటగిరీకి పెంచండి. బిహార్ వ్యాప్తంగా నేను హాజరయ్యే కార్యక్రమాలకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయండి. నాకు సెక్యూరిటీని పెంచకపోతే బిష్ణోయ్ గ్యాంగ్ నన్ను చంపేస్తుంది. అప్పుడు నా హత్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని లేఖలో పప్పూ యాదవ్ పేర్కొన్నారు.