ధరణి ఫోరెన్సిక్ ​ఆడిట్ టీమ్​కు స్వయం ప్రతిపత్తి

ధరణి ఫోరెన్సిక్ ​ఆడిట్ టీమ్​కు స్వయం ప్రతిపత్తి
  • సంక్రాంతి తర్వాత ఐటీ ఎక్స్​పర్ట్స్ టీమ్​తో ఆడిటింగ్ 
  • అనుమానం ఉన్న ప్రతి లావాదేవీని పరిశీలించాలని సర్కార్ నిర్ణయం
  • ఉన్నతస్థాయి అధికారులతో సంబంధం లేకుండానే చేసే యోచన 

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్​ఫోరెన్సిక్‌‌‌‌ ఆడిట్​బృందానికి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఫోరెన్సిక్​ఆడిట్​కోసం ఎంపిక చేసే ఎక్స్​పర్ట్​టీమ్ పై ఎవరి ఒత్తిడి లేకుండా, అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు బయటకు తీసేలా యాక్షన్​ప్లాన్ సిద్ధం చేస్తున్నది. జిల్లాల వారీగా భూములను ఆడిటింగ్‌‌‌‌ చేసేందుకు గాను రెవెన్యూ శాఖలోని ఉన్నతస్థాయి అధికారులతో సంబంధం లేకుండా ఈ నిపుణుల బృందాలను నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో అటాచ్‌‌‌‌ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.

ఫోరెన్సిక్​ఆడిటింగ్​బాధ్యతలు అప్పగించేందుకు గాను హైదరాబాద్‌‌‌‌కు చెందిన రెండు, ముంబైకి చెందిన మరో కంపెనీని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. రెవెన్యూ వ్యవహారాలు, సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ అంశాల్లో ఆ కంపెనీల బలమే ప్రాతిపదికగా ఈ మూడింటిలో ఒక దాన్ని ఎంపిక చేయనుంది. డిజిటల్‌‌‌‌ ఫుట్‌‌‌‌ ప్రింట్స్‌‌‌‌ ఆధారంగా భూముల లావాదేవీల్లో జరిగిన అవకతవకలను గుర్తించే  ప్రక్రియలో కేవలం నిపుణులైన వారిని మాత్రమే భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే ధరణి పోర్టల్‌‌‌‌ వివరాల రీవ్యాంప్‌‌‌‌ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో రానున్న 10–15 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలని, అనంతరం అంటే సంక్రాంతి తర్వాత ఫోరెన్సిక్‌‌‌‌ ఆడిటింగ్‌‌‌‌ బాధ్యతలు అప్పగించే కంపెనీని ఫైనల్‌‌‌‌ చేయాలని నిర్ణయించారు. 

2014 కంటే ముందున్న భూముల జాబితా ప్రాతిపదికగా.. 

భూదాన్, దేవాదాయ, అసైన్డ్, అటవీ, ప్రభుత్వ భూముల్లో జరిగిన కుంభకోణాలన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటపడతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రధానంగా రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేల కోట్ల భూబాగోతంపై ఫోకస్​పెట్టింది. ఫోరెన్సిక్‌‌‌‌ ఆడిటింగ్‌‌‌‌లో భాగంగా తొలుత హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని భూముల లావాదేవీలను మాత్రమే పరిశీలించాలని ప్రభుత్వం భావించినా.. తాజాగా సిరిసిల్ల, సిద్దిపేటలోనూ భూఅక్రమాలు జరిగాయని తేలిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనుమానం ఉన్న ప్రతి లావాదేవీని ఫోరెన్సిక్‌‌‌‌ ఆడిటింగ్‌‌‌‌లో పరిశీలించనుంది.

ఇందుకు 2014 కంటే ముందు ఉన్న నిషేధిత భూముల జాబితాను ప్రాతిపదికగా తీసుకోనుంది. ఈ జాబితాలో ఉన్న భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారాయి? ఎందుకు మారాయి? కోర్టు ఉత్తర్వుల పరిస్థితి ఏంటి? కోర్టు ఉత్తర్వులను కనీసం సవాల్‌‌‌‌ చేశారా? అసలు కోర్టు ఉత్తర్వులు నిజమైనవేనా? మాజీ సైనికుల పేరిట మార్చిన భూముల్లో ఎన్ని అసలైనవి ఉన్నాయి? మాజీ సైనికులకు ఆవార్డు చేసినట్టు బోగస్‌‌‌‌ డాక్యుమెంట్లు సృష్టించారా? పనివేళల్లో జరిగిన లావాదేవీలెన్ని? అర్ధరాత్రి తర్వాత ఏయే లావాదేవీలు జరిగాయి? ఏ కంప్యూటర్‌‌‌‌ నుంచి జరిగాయి? అనుమతి ఇచ్చింది ఎవరు? లాంటి అంశాలను సాంకేతిక సమాచారంతో సరిపోల్చి ఏం జరిగిందో నిర్ధారించనున్నారు.

ఈ ప్రక్రియ అనంతరం అక్రమాలు జరిగాయని తేలిన పక్షంలో వెంటనే సదరు భూములను స్వాధీనం చేసుకుని, ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌‌‌‌ కేసులు నమోదు చేయనున్నారు.

సిద్దిపేటలోనూ అక్రమంగా భూముల బదిలీ..  

సిరిసిల్ల తరహాలోనే సిద్దిపేటలోనూ ప్రభుత్వ భూములను కొల్లగొట్టినట్టు సర్కార్ గుర్తించింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల కోడ్​ వచ్చే కంటే కొద్ది రోజుల ముందు సిద్దిపేట జాతీయ రహదారికి సమీపంలోని ప్రైమ్​ఏరియాలో 484 ఎకరాల ప్రభుత్వ భూమిని బోగస్ పత్రాలతో ప్రైవేట్ వ్యక్తులకు అక్రమంగా బదిలీ చేసినట్టు నిర్ధారించారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్​అధికారంలో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్లి మరీ అనుకూల ఉత్తర్వులను అధికారులు తెచ్చారు.

అయితే ఆ తర్వాత తప్పుడు పత్రాలతో మళ్లీ ప్రభుత్వ భూమిని ప్రైవేట్​ పట్టాగా మార్చినట్టు తేల్చారు. ప్రస్తుతం ఈ భూమిని నిషేధిత జాబితాలో పెట్టారు. త్వరలోనే దీనిపైనా పూర్తి ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక మాన్యువల్ భూ రికార్డులను డిజిటలైజేషన్ చేసే పనిని కూడా త్వరలోనే ప్రారంభించనున్నారు. సీసీఎల్‌‌‌‌ఏ, కలెక్టరేట్‌‌‌‌లలో ఉన్న పహాణీలను డిజిటలైజ్​ చేయనున్నారు.