- బడ్జెట్ బుల్.. దూకుడే దూకుడు
- రెండో రోజూ మార్కెట్లలో ర్యాలీ
- మంగళవారం ఇన్వెస్టర్ల సంపద రూ. 4 లక్షల కోట్లు పెరిగింది
ముంబై: వరసగా రెండో రోజూ ర్యాలీ కొనసాగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ హైకి దగ్గరగా చేరాయి. బడ్జెట్ ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండటం స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం నింపింది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లూ పాజిటివ్‌గా కదలడం సెంటిమెంట్‌ను పెంచింది. కార్పొరేట్ ఎర్నింగ్స్ బాగుంటే మార్కెట్లు మరింత పెరుగుతాయనే ఆశాభావం ఇప్పుడు నెలకొంది.
మంగళవారం సెన్సెక్స్ 1,197 పాయింట్లు (2.46 శాతం) పెరిగి 49,798 వద్ద ముగిసింది. బడ్జెట్ ముందు వారంలో నష్టాలన్నింటినీ సెన్సెక్స్ గత రెండు రోజుల్లోనే రికవర్ చేసుకోగలిగింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 367 పాయింట్లు (2.57 శాతం) పెరిగి 14,648 పాయింట్లకు చేరింది.
బ్యాంకింగ్, ఇన్ఫ్రా, ఆటో సెక్టార్లలో ర్యాలీ కనిపిస్తోంది. కిందటి వారమంతా అమ్మకాలకు తెగబడిన ఎఫ్‌పీఐలు తమ ట్రెండ్‌ను రివర్స్ చేశారు. త్వరలో యూఎస్ కోవిడ్ సపోర్ట్ బిల్ తేనుందనే వార్తలూ మార్కెట్ పెరగడానికి సాయపడ్డాయి. ఈ ఏడాది చివరి నాటికి సెన్సెక్స్ 62 వేల పాయింట్లను టచ్ చేస్తుందని బ్రోకరేజి కంపెనీ మోతిలాల్ ఓస్వాల్ అంచనావేసింది. మంగళవారం సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద 4.19 లక్షల కోట్లు పెరిగింది.
మార్కెట్లో ఏం జరిగింది…
ఇండిగో పెయింట్స్ 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇష్యూ ధరతో పోలిస్తే 110 శాతం షేర్ ప్రైస్ పెరిగింది.
స్క్రాపేజ్ పాలసీ, క్యూ3 రిజల్ట్స్ నేపథ్యంలో టాటా మోటార్స్ 17 శాతం ఎగిసింది.
ప్రాఫిట్ బుకింగ్‌తో టైటాన్ 1 శాతం తగ్గింది.
బడ్జెట్ ప్రకటనలతో సిమెంట్, ఇన్ఫ్రా షేర్లు ర్యాలీ చేశాయి.
మొత్తం 249 షేర్లు 52 వారాల హై రికార్డు చేశాయి. వీటిలో ఐటీసీ, గ్రాసిమ్, ఎస్బీఐ, సీమెన్స్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బాష్‌లు ఉన్నాయి.
బ్లూచిప్స్‌లో టాటా మోటార్స్ షేరే ఎక్కువగా లాభపడింది. శ్రీ సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎస్బీఐ, యూపీఎల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కో షేర్లు లాభాల్లో ముగిశాయి.
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్ నిఫ్టీలో టాప్ లూజర్‌గా నిలిచింది. బజాజ్ ఫిన్సర్వ్, హీరో మోటో కార్ప్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ లైఫ్, టైటాన్, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు నష్టాలపాలయ్యాయి.
అశోక్ లేలాండ్, టీవీఎస్ మోటార్, జీ ఎంటర్టెయిన్మెంట్, సెంచురీ టెక్స్టైల్స్, కేఈసీ ఇంటర్నేషనల్, ఇండియన్ బ్యాంకులు మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లలో లాభపడ్డాయి. ఈ షేర్లు ఆరు నుంచి పది శాతం పెరిగాయి.
బలరాంపుర్ చీనీ మిల్స్, డీసీఎం శ్రీరామ్, ఈఐడీ ప్యారీ, కోరమాండల్ ఇంటర్నేషనల్, వరుణ్ బెవరేజెస్, సెయిల్ షేర్లు నష్టాలతో ముగిశాయి. ఓవరాల్‌గా చూస్తే 1,755 షేర్లు లాభాల్లోనూ, 1,184 షేర్లు నష్టాలలోనూ ముగిశాయి. 335 షేర్లు అప్పర్ సర్క్యూట్ తాకగా, 277 షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
For More News..