మరోసారి ఆల్​టైం హై... కొత్త గరిష్టానికి ఇండెక్స్​లు

మరోసారి ఆల్​టైం హై... కొత్త గరిష్టానికి ఇండెక్స్​లు
  • సెన్సెక్స్ 231 పా యింట్లు అప్​
  •  84 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

ముంబై:  ఈక్విటీ బెంచ్‌‌‌‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీలు శుక్రవారం తాజా జీవితకాల ముగింపు శిఖరాలను  తాకాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, యూఎస్​ రేటు తగ్గింపు ఆశలు ఊపందుకుంటున్న నేపథ్యంలో విదేశీ నిధుల ప్రవాహాలు పెరిగాయి. దీనికితోడు ఇండెక్స్ మేజర్లు భారతీ ఎయిర్‌‌‌‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్  ఇన్ఫోసిస్‌‌‌‌లలో కొనుగోళ్లు కూడా దేశీయ ఈక్విటీలలో ర్యాలీకి కారణమయ్యాయి.   వరుసగా తొమ్మిదో సెషన్‌‌‌‌లో ర్యాలీ చేస్తూ, 30-షేర్ బీఎస్‌‌‌‌ఈ సెన్సెక్స్ 231.16 పాయింట్లు పెరిగి ఆల్‌‌‌‌టైమ్ క్లోజింగ్ హై 82,365.77 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడేలో ఇది 502.42 పాయింట్లు పెరిగి ఇంట్రా-డే గరిష్ట స్థాయి 82,637.03ని తాకింది.  బీఎస్​ఈలో మొత్తం 2,228 స్టాక్‌‌‌‌లు పురోగమించగా, 1,701 తగ్గాయి. నిఫ్టీ 83.95 పాయింట్లు ఎగబాకి, 25,235.90 వద్ద కొత్త జీవితకాల ముగింపు గరిష్ట స్థాయిని తాకింది. వరుసగా 12వ రోజు కూడా ర్యాలీ చేసింది. ఇంట్రాడేలో ఇది 116.4 పాయింట్లు పెరిగి ఇంట్రా-డే గరిష్ట స్థాయి 25,268.35ను తాకింది.  సెప్టెంబర్‌‌‌‌లో యూఎస్​ ఫెడ్ రేటు తగ్గింపుపై ఆశలు పెరిగాయని, అందుకే యూఎస్​, ఇండియా మార్కెట్లు ఆల్​టైం హైలకు చేరుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. 

వారంలో సెన్సెక్స్​ 1.57 శాతం పెరుగుదల 

ఈవారం బీఎస్​ఈ బెంచ్‌‌‌‌మార్క్ 1,279.56 పాయింట్లు లేదా 1.57 శాతం,  నిఫ్టీ 412.75 పాయింట్లు లేదా 1.66 శాతం పెరిగింది.  తొమ్మిది రోజుల ర్యాలీలో, బీఎస్​ఈ బెంచ్‌‌‌‌మార్క్ 1,941.09 పాయింట్లు లేదా 2.41 శాతం పెరిగింది. నిఫ్టీ 12 సెషన్లలో 1,096.9 పాయింట్లు లేదా 4.54 శాతం జూమ్ చేసింది. నిఫ్టీ శుక్రవారం వరుసగా పన్నెండవ సెషన్‌‌‌‌లో లాభాలతో ముగిసిందని, 1996లో ప్రారంభించినప్పటి నుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ అన్నారు.  30 సెన్సెక్స్ సంస్థల్లో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్‌‌‌‌టీపీసీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, భారతీ ఎయిర్‌‌‌‌టెల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అత్యధికంగా లాభపడ్డాయి.

మరోవైపు, టాటా మోటార్స్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా,  ఐటీసీ వెనకబడి ఉన్నాయి. బీఎస్‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌క్యాప్ గేజ్ 0.75 శాతం, మిడ్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.53 శాతం పెరిగింది.  అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి.   ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ లాభాలతో స్థిరపడ్డాయి.  యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఫారిన్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) గురువారం రూ. 3,259.56 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.  దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.2,690.85 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.