IND vs ENG: ముగిసిన తొలి రోజు ఆట.. పట్టు బిగించిన టీమిండియా

IND vs ENG: ముగిసిన తొలి రోజు ఆట.. పట్టు బిగించిన టీమిండియా

ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట ఇంగ్లీష్ జట్టును 246 పరుగులకే ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. దీంతో తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. యంగ్ సంచలనం యశస్వి జైస్వాల్ (76), శుభమన్ గిల్(14) క్రీజ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ 24 పరుగులు చేసి లీచ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. రోహిత్, జైస్వాల్ తొలి వికెట్ కు 80 పరుగులు జోడించారు. ప్రస్తుతం భారత్ 127 పరుగులు వెనకబడి ఉంది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలి మొదటి గంటలో ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 5 రన్ రేట్ తో 53 పరుగులు చేసింది. అయితే ఈ దశలోనే మన స్పిన్నర్లు చెలరేగారు. వరుసపెట్టి వికెట్లు తీయడం మొదలుపెట్టారు. అశ్విన్ 55 పరుగుల వద్ద ఓపెనర్ బెన్ డకెట్ ను ఎల్బీడబ్ల్యూ గా ఔట్ చేసి భారత్ కు తొలి వికెట్ అందించాడు. దీంతో వికెట్ల పతనం ప్రారంభమైంది. 

ఒక దశలో వికెట్లేమీ కోల్పోకుండా 55 పరుగులతో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ అనూహ్యంగా 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి 60/3 గా నిలిచింది. ఈ దశలో సీనియర్ ప్లేయర్లు రూట్, బెయిర్ స్టో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్నారు. నాలుగో వికెట్ కు 61 పరుగులు జోడించి గౌరవప్రదమైన స్కోర్ అందించే ప్రయత్నం చేశారు. అయితే లంచ్ తర్వాత మరోసారి భారత స్పిన్నర్లు చెలరేగి వరుస విరామాల్లో వికెట్లు తీశారు. చివర్లో టైలండర్ల సహాయంతో స్టోక్స్ ధాటిగా ఆడటంతో 200 పరుగుల మార్క్ దాటింది. 
     
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 70 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెన్ డకెట్ (35) జానీ బెయిర్ స్టో(37) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రాకు తలో రెండు వికెట్లు లభించాయి.