ఒడిశా మెరుపు దాడులతో గడగడ వణికిపోయింది. దాదాపు రెండు గంటల వ్యవధిలో రాష్ట్రాన్ని 61వేల మెరుపు దాడులతో అతలాకుతలం చేశాయని రాష్ట్ర అధికార సంస్థ డేటాను ఉటంకిస్తూ పలు నివేదికలు తెలిపాయి. ఇవి ముఖ్యంగా సెప్టెంబర్ 2న రాజధాని ప్రాంతాన్ని తాకాయి. భువనేశ్వర్ నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాలు ఎడతెగని మెరుపు దాడులతో అస్తవ్యస్తంగా మారాయి. దాంతో పాటు ఉరుములతో కూడిన వర్షం రాష్ట్రమంతటా కొనసాగింది.
సాయంత్రం 5:30 గంటల సమయానికి 36వేల 597 ఆకాశంలో మెరుపులు సంభవించాయని, 25వేల 753 ఆకాశం నుంచి భూమిపై మెరుపులు పడ్డాయని ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (OSDMA) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
శనివారం ఒడిశాలోని ఆరు జిల్లాల్లో పిడుగులు పడి పది మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని విపత్తు నిర్వహణకు బాధ్యత వహించే స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (SRC) తెలిపారు. మే నెలలో నయాగర్ జిల్లాలోని సరణకుల పోలీసు పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.