కొలంబో: ఏసీసీ మెన్స్ ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నమెంట్‌లో యంగ్ ఇండియా సూపర్ పెర్ఫామెన్స్ చేస్తోంది. వరుసగా రెండు విక్టరీలతో మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. బౌలింగ్‌లో నిశాంత్ (4/14), బ్యాటింగ్‌లో ఐపీఎల్ సన్‌రైజర్స్ స్టార్ అభిషేక్ శర్మ (69 బాల్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87) విజృంభించడంతో సోమవారం జరిగిన గ్రూప్–బి మ్యాచ్‌లో ఇండియా–ఎ 9 వికెట్ల తేడాతో నేపాల్–ఎను చిత్తుగా ఓడించింది. దాంతో, నాలుగు పాయింట్లతో గ్రూప్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది.
ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత నేపాల్ 39.2 ఓవర్లలో 167 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ పాడెల్ (65) హాఫ్ సెంచరీతో రాణించాడు. గుల్షాన్ ఝా (38) ఫర్వాలేదనిపించాడు. ఇండియా బౌలర్లలో నిశాంత్‌కు తోడు రాజ్‌వర్దన్ హంగార్గేకర్ మూడు, హర్షిత్ రాణా రెండు వికెట్లు తీశారు. అనంతరం ఓపెనర్లు అభిషేక్, సాయి సుదర్శన్ (52 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 58 నాటౌట్) మెరుపులతో ఇండియా 22.1 ఓవర్లలోనే 172/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. అభిషేక్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం జరిగే గ్రూప్ చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్–ఎతో ఇండియా పోటీ పడనుంది.
బౌలర్ల జోరు
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ను ఇండియా బౌలర్లు వణికించారు. స్టార్టింగ్‌లో పేసర్లు హర్షిత్ రాణా, హంగార్గేకర్ దెబ్బకు పది ఓవర్లకే సగం వికెట్లు కోల్పోయిన నేపాల్ ఎదురీత మొదలు పెట్టింది. ఇన్నింగ్స్ రెండో బాల్‌కే ఓపెనర్ కుశాల్ (0)ను ఎల్బీ చేసిన రాణా ప్రత్యర్థికి షాకిచ్చాడు. కాసేపటికే హంగార్గేకర్ తన వరుస ఓవర్లో ఆసిఫ్ షేక్ (7), దేవ్ ఖనాల్ (15)ను పెవిలియన్ చేర్చాడు. తర్వాతి ఓవర్లోనే రాణా బౌలింగ్‌లో భీమ్ షార్కి (4) బౌల్డ్ అవగా.. హంగార్గేకర్ బౌలింగ్‌లో కుశాల్ మల్లా (0) అభిషేక్‌కు క్యాచ్ ఇవ్వడంతో నేపాల్ 37/5తో నిలిచి వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ పాడెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. సోంపాల్ కామి (14)తో ఆరో వికెట్‌కు 53 రన్స్ జోడించాడు. ఆ తర్వాత గుల్షన్ నుంచి అతనికి సపోర్ట్ లభించింది. వేగంగా ఆడిన గుల్షన్ ఏడో వికెట్‌కు 54 రన్స్ జోడించడంతో నేపాల్ 200 స్కోరు చేసేలా కనిపించింది. అయితే, చివర్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ నిశాంత్ చెలరేగాడు. వరుస ఓవర్లలో రోమిత్, గుల్షన్‌ను పెవిలియన్ చేర్చాడు, పవన్ సరాఫ్ (6), లలిత్ (3) కూడా అతని బౌలింగ్‌లోనే ఔటవడంతో నేపాల్ ఇన్నింగ్స్ 40 ఓవర్లోనే ముగిసింది.
ALSO READ :శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన రద్దీ
ఓపెనర్ల హవా
ఛేజింగ్‌లో ఓపెనర్లు అభిషేక్, సాయి సుదర్శన్ చెలరేగి ఆడటంతో చిన్న టార్గెట్ ను ఇండియా ఈజీగా అందుకుంది. ఇన్నింగ్స్ ఐదో బాల్‌ను బౌండ్రీకి చేర్చిన సుదర్శన్ రెండో ఓవర్లో రెండు ఫోర్లతో జోరు పెంచాడు. కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్న అభిషేక్ మూడో ఓవర్లో రెండు ఫోర్లతో గేరు మార్చాడు. అక్కడి నుంచి ఇద్దరూ వరుస బౌండ్రీలతో హోరెత్తించారు. ఐపీఎల్లో అదరగొట్టిన ఈ ఇద్దరు యంగ్‌స్టర్స్ నేపాల్ బౌలర్లపై విరుచుకుపడటంతో 14 ఓవర్లకే ఇండియా స్కోరు 100 దాటింది. ఈ క్రమంలో 44 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న అభిషేక్ తర్వాత మరింత రెచ్చిపోయాడు. వెంటవెంటనే రెండు సిక్సర్లు కొట్టాడు. సెంచరీ చేసేలా కనిపించిన అతను 19వ ఓవర్లో ఔటవడంతో తొలి వికెట్‌కు 139 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. 47 బాల్స్‌లో ఫిఫ్టీ దాటిన సుదర్శన్‌కు తోడైన ధ్రువ్ జురుల్ (21 నాటౌట్) సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు.