ఉక్రెయిన్ నుంచి రష్యా సేనలు తక్షణం బేషరతుగా, పూర్తిగా వైదొలగాలని కోరుతున్న తీర్మానం ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ఇటీవల ఓటింగ్ కు వచ్చినపుడు భారత్ గైర్హాజరైంది. ఇలా ఓటింగ్ కు గైర్హాజరైన 32 దేశాల్లో చైనా, పాకిస్తాన్ లు కూడా ఉన్నాయి. మొత్తం193 దేశాలు సర్వ ప్రతినిధి సభలో సభ్యులుగా ఉన్నాయి. ఢిల్లీ విదేశాంగ విధానం ప్రజలను కేంద్ర బిందువుగా చేసుకునే కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి సంక్లిష్టంగా ఉందని ఆమె అన్నారు. ఉక్రెయిన్ పై దురాక్రమణకుగాను రష్యాను శిక్షించాలని కోరుతూ2022 మార్చి నుంచి సమితిలో వచ్చిన తీర్మానాలపై భారత్ ఓటింగ్ లో పాల్గొనకపోవడం ఇది ఆరోసారి. ఈ తీర్మానానికి రష్యా మిత్రదేశమైన బెలారస్ తెచ్చిన సవరణలపై జరిగిన ఓటింగ్ లో కూడా భారత్ పాల్గొనలేదు. మొత్తంమీద, ఐక్యరాజ్య సమితికి చెందిన వివిధ సంస్థల్లో ఉక్రెయిన్ సంబంధిత పరిణామాలపై ఓటింగ్ జరిగిన మూడు పదులకు పైగా సందర్భాల్లో భారత్ గైర్హాజరైంది. రెండు దేశాలకు అంగీకారయోగ్యమైన, ఆచరణసాధ్యమైన పరిష్కారం ఏదైనా అంతర్జాతీయ సమాజం వద్ద ఉందా అనేది భారత్ ప్రశ్న.
రష్యాకు అండగా నిలుస్తున్న చైనా
రష్యా దాడిలో ఉక్రెయిన్లోని బుకాలో పౌరులు భారీ సంఖ్యలో మరణించడంతో భారత్ తన గొంతు తీవ్రతను పెంచింది. పాశ్చాత్య దేశాల స్వరంతో శృతి కలిపింది. పౌరులపై దాడిని ఖండిస్తూ ఆ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలని కూడా కోరింది. భారత్ వైఖరిలో వచ్చిన భారీ మార్పుకు ఇది అద్దం పట్టింది. సాధారణంగా అంతర్జాతీయ దర్యాప్తు అనే భావనకు భారత్ దూరంగా ఉంటూ వస్తోంది. కాశ్మీర్ తదితర విషయాల్లో పాక్ అలాంటి డిమాండ్ చేసినప్పుడల్లా భారత్ దాన్ని తిరస్కరిస్తూ వస్తున్నది. అలాగే, యుద్ధం మొదలు పెట్టిన కొన్ని నెలల తర్వాత కూడా విజయం కనుచూపు మేరలో కనిపించకపోవడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ బెదిరింపులకు దిగడంతో “ఇది యుద్ధాల శకం కాదు” అని ప్రధాని మోడీ హితవు చెప్పాల్సి వచ్చింది. గతంలో పాక్ కూడా మన పట్ల అదే రకమైన బెదిరింపులకు దిగేది. “మేము మాత్రం వాటిని(అణ్వాయుధాలు) దీపావళి కోసం అట్టేపెట్టుకున్నామా ఏమిటి?” అని మోడీ వ్యాఖ్యానించడంతో పాక్ తోకముడిచింది. ఆహార ధాన్యాల రవాణాకు రష్యా అడ్డుపడుతోందని ఉక్రెయిన్ చెప్పినపుడు, భారత్ దాన్ని రష్యా దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా పరిష్కరించడంలో తోడ్పడింది. రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇంధన ధరలు పెరిగిపోవడంతో వర్థమాన, బడుగు దేశాల తరఫున భారత్ తన గొంతును వినిపించేందుకు వెనుకాడలేదు. ఉక్రెయిన్ కు అమెరికా, ఐరోపా దేశాలు గట్టి మద్దతు ఇస్తున్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని వ్యతిరేకించే చైనా మనలానే తటస్థ వైఖరిని అనుసరిస్తున్నట్లు చెబుతూనే లోపాయకారీగా రష్యాకు అండగా నిలుస్తోంది. కాల్పుల విరమణ, శాంతి చర్చలు, రష్యాపై ఆంక్షలకు స్వస్తి పలకడం, యుద్ధ ఖైదీల సంరక్షణ, పౌరులపై దాడులను నిలిపివేయడం, అణు విద్యుత్ కేంద్రాలను సురక్షితంగా ఉంచడం, ఆహార ధాన్యాల రవాణాకు వెసులుబాటు కల్పించడం వంటి పన్నెండు ప్రతిపాదనలతో చైనా ముందుకు వచ్చింది. దాని ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
జీ-20 అధ్యక్ష హోదాను భారత్సరిగా వాడుకోవాలి
రష్యా దుశ్చర్యను ఖండించాలని అమెరికా, యూరప్ ల నుంచి భారత్ పై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షల నడుమ కూడా రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయగలుగుతోంది. ప్రస్తుతం భారత్ వద్దనున్న చమురులో దాదాపు 25 శాతం రష్యా నుంచి కొన్నదే. యుద్ధానికి ముందు ఆ వాటా కేవలం 2 శాతంగా ఉండేది. భారతదేశం ఒక రకంగా ఒంటితాడుపై నడుస్తోంది. ఇంతవరకు రష్యాకు, ఉక్రెయిన్- అమెరికా- యూరప్ దేశాల కూటమికి మధ్య సమతూకాన్ని కాపాడుకుంటూ వస్తున్నా, రానున్న రోజుల్లో ఇది భారత్ కు అగ్ని పరీక్ష కానుంది. యుద్ధం ఇప్పట్లో ముగిసేందుకున్న అవకాశాలు పరిమితం. అమెరికా, యూరప్ దేశాల ఆయుధ సంపత్తి కీవ్ కు అందుతుండటం ఒక్కటే అందుకు కారణం కాదు. తమ దేశాన్ని తాము రక్షించుకోవాలనే ఉక్రెయిన్ ప్రజల సంకల్ప బలం ఆ దేశాన్ని ముందుకు నడిపిస్తోంది. దెబ్బ తీయడం మాటెలా ఉన్నా దెబ్బ కాచుకోగలుగుతోంది. రష్యన్ సేనలను ఉక్రేన్ పౌరులు మొదట్లో ధైర్యంగా ప్రతిఘటించడం మొదలెట్టిన తర్వాతే దానికి పశ్చిమ దేశాల సైనిక మద్దతు లభించడం ప్రారంభమైందన్న సంగతి మనం మరచిపోకూడదు. రష్యా మనకి చాలా కాలంగా మిత్ర దేశంగా ఉండి ఉండవచ్చు. రక్షణ పరికరాల సరఫరాతో భరోసా ఇస్తూ ఉండవచ్చు. అంతమాత్రాన ఉక్రెయిన్ లో రష్యా అతిక్రమణలను భారత్ చూసీచూడనట్లు ఊరుకుంటుందనుకుంటే పొరపాటు. ఉక్రెయిన్ పై రష్యా దాడి భారత్ దీర్ఘకాలిక ప్రయోజనాలపై నీలినీడలు ప్రసరింపజేసే అవకాశం ఉంది. రష్యా దురాక్రమణతో ప్రపంచపు భౌగోళిక రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. నిద్రాణంగా ఉన్న జర్మనీ క్రియాశీలంగా మారింది. పోలెండ్ తో సహా తూర్పు, మధ్య యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలవాలని కోరడంలో ముందున్నాయి. మాజీ సోవియట్ రిపబ్లిక్ లు కూడా రష్యా దాడిని ఖండిస్తున్నాయి. స్వీడన్, ఫిన్ ల్యాండ్ లు కూడా ‘నాటో’ కూటమిలో చేరే అవకాశాలున్నాయి. శాంతి కాముకులెవరూ రష్యా చర్యను హర్షించడం లేదు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని గట్టిగా వ్యతిరేకించకపోతే మరికొన్ని దేశాలు బల ప్రయోగంతో తమ పొరుగునున్న దేశాల ఆక్రమణకు దిగడానికి అవకాశం కల్పించినట్లవుతుంది. యూరప్ తో రష్యాకు ఉన్నట్లుగానే చైనాకు కూడా భూ, సాగర హద్దుల విషయంలో చాలా వివాదాలున్నాయి. రష్యా- – చైనా మైత్రి మరీ బలపడటం కూడా భారత్ ప్రయోజనాలకు సవాల్ గా నిలుస్తున్నది. జీ-20 అధ్యక్ష హోదాను సద్వినియోగం చేసుకుంటూ భారత్ ఇతర దేశాలతోనూ సత్సంబంధాలను బలపరచుకోవాలి.-
భారత్ చేతులు కట్టుకుని కూర్చోలేదు
రష్యా, ఉక్రెయిన్ ల ప్రమేయం లేకుండా చేపట్టే ఏ ప్రక్రియయైనా విశ్వసనీయమైన, అర్థవంతమైన పరిష్కారాన్ని సాధించగలదా అని భారత్ సందేహపడుతోంది. స్వీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, ఎవరి ఒత్తిడులకు లొంగకుండా భారత్ కొంతకాలంగా స్వతంత్ర వైఖరి అనుసరిస్తోంది. మొదట్లో రష్యా పేరును నేరుగా ప్రస్తావించకుండా ఉక్రెయిన్ పరిణామాల పట్ల “తీవ్రంగా కలత చెందుతున్నట్లు” ప్రకటించిన భారత్ తర్వాత “హింసకు స్వస్తి పలకాలని, వైషమ్యాలను విడనాడా”లని పిలుపునిచ్చింది. “ కాల్పుల విరమణ”ను మించిన స్థితిని భారత్ కోరుకుంది. ఉక్రెయిన్లో చదువుకుంటున్న మన విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రాధాన్యమిచ్చింది. రష్యా దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ పై భారతీయులకు సానుభూతి ఉన్నమాట నిజం. రష్యా దుశ్చర్యలను ఖండిస్తూ, ఉక్రెయిన్ కు సంఘీభావం ప్రకటించాలనే అభిలాష కూడా చాలా మందికి ఉంది. కానీ, తీర్మానం చేసినంత మాత్రాన యుద్ధం ఆగే పరిస్థితులు లేవు. అలా అని, భారత్ చేతులు కట్టుకుని ఏమీ కూర్చోలేదు. యుద్ధాన్ని ఆపడానికి మరీ క్రియాశీలంగా కాకపోయినా తనవంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. ఆ మాటకొస్తే భారత్, చైనాలు నయానోభయానో చెప్పబట్టే ఈ యుద్ధంలో రష్యా అణ్వాయుధాల ప్రయోగానికి ఇంతవరకు దిగలేదని అమెరికా కూడా అంగీకరించింది. “ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని” కాపాడుకునే హక్కు ప్రతి దేశానికి ఉందని, ఐక్యరాజ్య సమితి నియమావళిని గౌరవించాలని కూడా భారత్ స్పష్టం చేసింది. ఎందుకంటే, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం(రష్యా) తన పొరుగు దేశం(ఉక్రెయిన్)పై దాడికి దిగింది. చైనా మన పట్ల అదే తీరును ప్రదర్శిస్తున్న సంగతిని దృష్టిలో ఉంచుకొనే భారత్ అలా వ్యాఖ్యానించింది. చర్చలు, దౌత్యం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.
– మల్లంపల్లి ధూర్జటి, సీనియర్జర్నలిస్ట్