ఇస్లామోఫోబియాపై యూఎన్ లో ఓటింగ్..ఇండియా గైర్హాజరు

  • ఎంతసేపూ ఆ ఒక్క మతం గురించే ఆలోచిస్తారా?
  • నిలదీసిన భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ 

యునైటెడ్ నేషన్స్ :  ఇస్లామోఫోబియాపై యునైటెడ్ నేషన్స్ లో నిర్వహించిన ఓటింగ్ కు ఇండియా గైర్హాజరైంది. చైనా సహకారంతో పాకిస్తాన్  శుక్రవారం ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై యూఎన్ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్  నిర్వహించారు. ‘ఇస్లామోఫోబియాపై పోరాడేందుకు తీసుకోవాల్సిన చర్యలు’ పేరుతో ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. 115 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయగా 44 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.

ఏ ఒక్క దేశం కూడా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయలేదు. ఓటింగ్ కు దూరంగా ఉన్న దేశాల్లో భారత్, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్, యూకే ఉన్నాయి. ఈ సందర్భంగా యూఎన్​లో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ ఎంతసేపూ ఇస్లామోఫోబియాపైనే చర్చించడం సరికాదన్నారు. నిస్సందేహంగా ఇస్లామోఫోబియా అంశం ప్రాధాన్యం ఉన్నదే అని, హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం వంటి ఇతర మతాలు కూడా మతపరమైన హింస, వివక్ష ఎదుర్కొంటున్నాయని, ఆ మతాల ప్రజల సమస్యలపైనా జనరల్ అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు..

ఏ ఒక్క మతంపైనా వివక్ష చూపరాదు. అది ఏ మతమైనా సరే. పాకిస్తాన్  ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఓడించాల్సిందే. ఎందుకంటే, ఈ రోజు ఒక దేశం ఇస్లామోఫోబియాపై తీర్మానం పెడితే రేపు మతాల ఫోబియాలపై మరికొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టవచ్చు. యూఎన్ ను మతపరమైన క్యాంపులుగా ఈ తీర్మానం విడగొట్టే ప్రమాదం ఉంది. మతాలకు అతీతంగా యూఏన్ ఆలోచించాలి” అని రుచిరా కాంబోజ్ వ్యాఖ్యానించారు.