న్యూఢిల్లీ: ఇనీషియల్పబ్లిక్ ఆఫర్లు (ఐపీఓలు) దలాల్ స్ట్రీట్‌ను ముంచెత్తుతున్నాయి. దాదాపు ప్రతి వారం ఏదో ఒక ఐపీఓ వస్తూనే ఉంది. ఈ విషయంలో మనదేశం దూసుకెళ్తోంది. సంపద నిర్వహణ సంస్థ ఏంజెల్ వన్ వెల్త్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. 2024 మొదటి అర్ధ భాగంలో (హెచ్1) గ్లోబల్ ఐపీఓల్లో భారతదేశం వాటా 25 శాతం ఉంది. అంటే ప్రతి నాలుగు ఐపీఓల్లో ఒకటి మనదేశం నుంచే ఉంది. దేశంలో ఇప్పుడు అత్యధిక సంఖ్యలో మెయిన్‌బోర్డ్ లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 5,450కిపైగా కంపెనీలు మన మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి.
ఈ ఏడాది సెప్టెంబరు వరకు 53 ఐపీఓలు ఇన్వెస్టర్ల ముంగిటికి వచ్చాయి. గ్లోబల్ మార్కెట్లలో2021లో భారీగా లిస్టింగ్స్ వెల్లువెత్తాయి. అప్పుడు 2,388 కంపెనీలు ఐపీఓల ద్వారా 453.3 బిలియన్ డాలర్లను సేకరించాయి. ఇది గత 20 సంవత్సరాలలో అత్యధికం. గత ఏడాది 178 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలోకి వచ్చాయి. చైనా నుంచి 103, యూఎస్ నుంచి 21 నుంచి, యూకేలో 22 కంపెనీల్లో లిస్ట్ అయ్యాయి.
భారీగా లాభాలు
ఈసారి బీఎస్ఈ ఐపీఓ ఇండెక్స్ 348 శాతం పెరగగా, బీఎస్ఈ 500 ఇండెక్స్ 165 శాతం రాబడిని మాత్రమే ఇచ్చింది. లిస్టింగ్ లాభాలు భారీగా ఉండటమే ఇందుకు కారణం. లాభాల విషయంలో ఎస్ఎంఈ ఐపీఓలు, మెయిన్‌బోర్డ్ ఐపీఓలను అధిగమించాయి. ఎంఎస్ఈలలో సగటు లిస్టింగ్ లాభాలు 2019లో రెండు శాతం నుంచి 2024లో 74 శాతానికి పెరిగాయి. అయితే మెయిన్‌బోర్డ్ ఐపీఓలలో సగటు లిస్టింగ్ లాభాలు 2020లో భారీస్థాయికి చేరుకున్నాయి.
అప్పటి నుంచి సగటున 30 శాతం వరకు వస్తున్నాయి. వినియోగదారు ఉత్పత్తులు, రిటైల్ కంపెనీలు, పారిశ్రామిక ఉత్పత్తులు, ఆర్థిక సేవలు, ఆరోగ్య సంరక్షణ సెక్టార్ల నుంచి ఐపీఓలు ఎక్కువగా వస్తున్నాయి. లిస్టింగ్‌లో భారీ లాభాలు ఇచ్చిన షేర్లను ఇన్వెస్టర్లు చాలా త్వరగా అమ్మేస్తున్నారని సెబీ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో వెల్లడయింది. ఏప్రిల్ 2021 డిసెంబర్ 2023 మధ్య లిస్ట్ అయిన 144 ఐపీఓల నుంచి తీసుకున్న డేటాతో సెబీ ఈ వివరాలను కనుగొంది.