SpaDeX: జయహో ఇస్రో.. డాకింగ్ ప్రయోగం సక్సెస్

అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానించేలా ఇస్రో (ISRO) చేపట్టిన స్పేడెక్స్(SpaDeX) మిషన్‌ సక్సెస్ అయ్యింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడుతూ వచ్చిన డాకింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో గురువారం (జనవరి 16) ప్రకటించింది. రెండు ఉపగ్రహాలు ఒక్కటి అవుతున్న డాకింగ్‌ ప్రక్రియకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ విజయం పట్ల ఇస్రో టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read :- ఊర్లకు పోయినోళ్లు వస్తున్నరు

డిసెంబరు 30, 2024న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి PSLV C60 రాకెట్‌ ప్రయోగం ద్వారా ఇస్రో రెండు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది. అవి రెండూ.. SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్). ఇవి ఒక్కొకటి దాదాపు 220 కిలోల బరువు ఉన్నాయి. మొదట వీటిని 475 కిలోమీటర్ల వృత్తాకార ఉంచారు. అనంతరం దూరాన్ని తగ్గించుకుంటూ 15 మీ నుండి 3 మీ హోల్డ్ పాయింట్ వరకు తీసుకొచ్చారు. చివరగా గురువారం ఉదయం రెండు ఉపగ్రహాలను ఒక్కటి చేశారు.

ఈ విజయంతో స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. మన కంటే ముందు చైనా, రష్యా, అమెరికా దేశాలు స్పేస్ డాకింగ్‌ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాయి.