
- మీడియా సమావేశంలో ట్రంప్ వెల్లడి
వాషింగ్టన్: ఇండియా టారిఫ్‌ల అంశంపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు. ‘‘భారత్‌లో టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ దేశంలో మేం ఏమీ అమ్మలేకపోతున్నాం. భారత్ అత్యధికంగా సుంకాలు వేస్తోందని నేను బహిరంగంగా చెప్పినందుకే సుంకాలను తగ్గించేందుకు ఆ దేశం అంగీకరించింది” అని ఆయన చెప్పారు. శుక్రవారం వాషింగ్టన్‌లోని ఓవల్ ఆఫీసులో మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.
భారత్‌తోపాటు ప్రపంచంలోని ప్రతి దేశమూ అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తూ లాభపడుతున్నాయని అన్నారు. ఇండియా అయితే టారిఫ్ లపై మరీ కఠినంగా ఉందన్నారు. అయితే, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ తాజాగా అమెరికాలో పర్యటించి, ఆ దేశ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తో చర్చలు జరిపిన నేపథ్యంలో సుంకాలు తగ్గించుకునేందుకు ఇండియా అంగీకరించిందంటూ ట్రంప్ ప్రకటన చేయడం గమనించదగ్గ విషయం. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కూడా టారిఫ్‌లపై ట్రంప్ విమర్శలు చేశారు.
రిపోర్టర్లపై ట్రంప్ గరంగరం..
అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ లో ఉద్యోగుల సంఖ్య తగ్గింపు విషయంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, సలహాదారు ఎలాన్ మస్క్ మధ్య వాగ్వాదం జరిగిందన్న వార్తలను ట్రంప్ ఖండించారు. ఇటీవల ట్రంప్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలోనే విదేశాంగ శాఖలో ఉద్యోగులను తగ్గించడంలో రూబియో ఫెయిల్ అయ్యారని మస్క్ విమర్శించారని, దీనిపై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం వెలువరించింది.
అయితే, ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణపై ఫిఫా ప్రెసిడెంట్ గియానీ ఇన్ఫాంటినోతో కలిసి ట్రంప్ నిర్వహించిన మరో మీడియా సమావేశంలో విలేకరులు ఈ గొడవపై ప్రశ్నించగా.. అలాంటిదేమీ జరగలేదని, మీరే వివాదం రేకెత్తించాలని చూస్తున్నారంటూ ఓ రిపోర్టర్ పై ట్రంప్ ఫైర్ అయ్యారు. మస్క్, రూబియో ఇద్దరూ అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇదే ప్రశ్న అడిగిన మరో రిపోర్టర్ పైనా ఆయన మండిపడ్డారు. ఏ చానల్ నుంచి వచ్చారు? అని అడగగా.. ఎన్బీసీ అని ఆ రిపోర్టర్ బదులిచ్చాడు. ‘‘అయితే, నీవు ఇలాంటి ప్రశ్న అడగడంలో వింతేమీ లేదు” అంటూ ఎద్దేవా చేశారు.