బ్లోమ్‌ఫోంటెయిన్: భవిష్యత్ స్టార్ క్రికెటర్లుగా ఎదగడానికి తొలి మెట్టుగా భావించే అండర్–19 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. తమ దేశ జాతీయ జట్లలో చోటు సంపాదించాలనే ప్రతి కుర్రాడు శుక్రవారం నుంచి జరిగే మెగా టోర్నీలో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు.
ఇప్పటికే ఐదుసార్లు కప్ నెగ్గిన యంగ్ టీమిండియా (2000, 2008, 2012, 2018, 2022) ఆరోసారి టైటిల్‌ను సాధించి రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉదయ్ శరణ్ నేతృత్వంలోని ఇండియా టీమ్.. శనివారం జరిగే తొలి పోరులో బంగ్లాదేశ్‌తో పోటీపడనుంది. శరణ్‌తో పాటు అర్షిన్ కులకర్ణి, ఆరవెల్లి అవనీష్, ముషీర్ ఖాన్, రాజ్ లింబానీ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మొత్తం 16 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు.
ప్రతి గ్రూప్‌లో టాప్–3లో నిలిచిన టీమ్స్ సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో 12 టీమ్స్‌ను రెండు పూల్స్‌గా విభజిస్తారు. ప్రతి పూల్‌లో టాప్–2 సెమీస్‌కు చేరుకుంటాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా (1988, 2002, 2010), పాకిస్తాన్ (2004, 2006), సౌతాఫ్రికా (2014), వెస్టిండీస్ (2016) నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురుకానుంది.