ముంబై : ఏకైక టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇండియా విమెన్స్ టీమ్.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై గురి పెట్టింది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. అయితే ఈ ఫార్మాట్‌లో ఆసీస్‌పై ఇండియాకు మంచి రికార్డు లేదు. ఆడిన 50 మ్యాచ్‌ల్లో కేవలం 10 మాత్రమే నెగ్గింది. ఇక స్వదేశంలోనూ కంగారూలతో ఆడిన 21 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే నెగ్గి 17 మ్యాచ్‌ల్లో ఓడింది.
దీంతో ఈ సిరీస్‌ను గెలిచి ఈ రెండు రికార్డులను కొద్దిగానైనా మెరుగుపర్చుకోవాలని హర్మన్‌సేన లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఇండియాకు సిరీస్ గెలవడం పెద్ద కష్టం కాకపోయినా ఆసీస్‌ను తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే చివరిసారిగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఇండియా ఒక్కటి కూడా గెలవలేదు. ఈ రికార్డు స్ఫూర్తితో కంగారూలు చెలరేగితే హర్మన్ బృందానికి కష్టాలు తప్పవు.
ఈ సిరీస్ కోసం ఇండియా కొత్త ప్లేయర్లు శ్రేయాంక పాటిల్, సైకా ఇషాకి, మన్మత్ కశ్యప్, టిటాస్ సాధూలను టీమ్‌లోకి తీసుకుంది. అయితే బంగ్లాపై ఆరు వికెట్లు తీసిన దేవికా వైద్య లేకపోవడం లోటుగా కనిపిస్తున్నది. ఈ ఏడాది టీమిండియా కేవలం మూడు వన్డేలే ఆడింది. జెమీమా, స్మృతి మంధాన, షెఫాలీ వర్మ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు.