కోల్‌కతా: వన్డే వరల్డ్‌కప్‌లో జోరుమీదున్న ఇండియాకు షాక్ తగిలింది. గాయపడ్డ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టోర్నీ నుంచి వైదొలిగాడు. చీలమండ గాయం నుంచి కోలుకోకపోవడంతో అతని స్థానంలో యంగ్ పేసర్ ప్రసిధ్ కృష్ణ టీమ్‌లోకి వచ్చాడు. ఇందుకు ఐసీసీ శనివారం క్లియరెన్స్ ఇచ్చింది. గత నెల 19న పుణెలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో పాండ్యా ఎడమ కాలు చీలమండకు గాయమైంది.
దాంతో, బెంగళూరు ఎన్‌సీఏలో చేరిన పాండ్యా కోలుకున్నాడు. అయితే, తిరిగి ట్రెయినింగ్ స్టార్ట్ చేయగా చీలమండలో మళ్లీ వాపు వచ్చి గాయం తిరగబెట్టినట్టు ఎన్‌సీఏ వర్గాలు తెలిపాయి. టోర్నీ చివరి వరకు కూడా అతను కోలుకునే అవకాశం లేదని చెప్పాయి. వరల్డ్‌కప్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరం అవుతున్నానన్న విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని పాండ్యా ట్వీట్ చేశాడు. ఆటకు దూరమైనా తాను జట్టుతోనే ఉండి తోటి ఆటగాళ్లను ఉత్సాహపరుస్తానని పేర్కొన్నాడు. ఈ టీమ్ చాలా స్పెషల్ అన్న పాండ్యా తాము ప్రతి ఒక్కరినీ గర్వపడేలా చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.