న్యూఢిల్లీ: కేంద్రంపై లోక్ సభలో బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. మణిపూర్ అంశంపై పార్లమెంట్లో ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని పట్టుబడుతూ సభను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు ఈ దిశగా కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మంగళవారం జరిగిన మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే అవిశ్వాస తీర్మానం డ్రాఫ్ట్ కాపీ సిద్ధం అయిందని, బుధవారం సభలో దీనిని ప్రవేశపెట్టేందుకు నేతలు సిద్ధమవుతున్నారని కూటమి వర్గాలు వెల్లడించాయి. కాగా, రూల్ 198 ప్రకారం లోక్ సభలోని ఏ సభ్యుడైనా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ నోటీస్ ఇవ్వవచ్చు. దీనికి కనీసం 50 మంది సభ్యులు ఆమోదం తెలిపితే.. పది రోజుల్లోగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు. స్పీకర్ తిరస్కరిస్తే తీర్మానం ఫెయిల్ అవుతుంది.
ALSO READ :కరెంట్షాక్తో.. వేర్వేరు చోట్ల నలుగురు మృతి
ఉభయసభల్లో అదే గందరగోళం..
పార్లమెంట్ సమావేశాల్లో నాలుగో రోజూ ప్రతిపక్షాలు నిరసనలతో హోరెత్తించాయి. లోక్ సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఆందోళనలు మొదలుపెట్టారు. దీంతో సమావేశాలు పలుమార్లు వాయిదా పడ్డాయి. గందరగోళం మధ్యే బయాలజికల్ డైవర్సిటీ(అమెండ్ మెంట్) బిల్లును సభ ఆమోదించినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభలోనూ అదే సీన్ కనిపించింది. మణిపూర్ అంశంపై చర్చ విషయంలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లీడర్ ఆఫ్ ది హౌస్ పీయూష్ గోయల్ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రతిపక్షాల నిరసనలతో రాజ్యసభ కూడా పెద్దగా కార్యకలాపాలు లేకుండానే వాయిదాపడింది.