ఇండియా ..కూటమి అవసరం

ఇండియా ..కూటమి అవసరం

కాంగ్రెసేతర ఫ్రంట్​ అని, బీజేపీ, కాంగ్రెసేతర మూడవ ఫ్రంట్ అని రాజకీయ పార్టీలు మీనమేషాలు లెక్కించుకుంటూ ఉండటంవల్ల బీజేపీ బలపడింది. సార్వత్రిక ఎన్నికలకు ఓ సంవత్సరకాలం ముందు నుంచి రాజకీయ కూటములపై చర్చలు చేయడం, ఎన్నికల సమయంలో ఎక్కడికక్కడ విడిపోవడంవల్ల బీజేపీని ఇతర పార్టీలు ఎదుర్కోలేకపోతున్నాయి.  సెంటిమెంట్లు, గుడులు, దేశభక్తి పేరిట భావోద్వేగాల ఆసరాగా  బీజేపీ అధికారంలోకి వస్తోంది. 

గత లోక్​సభ ఎన్నికల్లోనూ, అంతకుముందు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ సామాజిక పార్టీలు కాంగ్రెస్​ పార్టీతో సయోధ్యగా లేవు.  ఒకవేళ కలిసి అవన్నీ సఖ్యతగా పోటీ చేసి ఉంటే బీజేపీకి భారీ విజయాలు లభించేవి కావు. ఎన్నికల వరకూ పొత్తు పొత్తు అంటూనే చివర్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు రాజకీయాలు చేయడంవల్ల బీజేపీ విజయం నల్లేరు మీద నడకవుతున్నది.

ఎన్నికల్లో ఒకే పార్టీ శాశ్వతంగా గెలువదన్నమాట వాస్తవమే. కానీ, బీజేపీ అధికారంలోకి రావడంవల్ల ప్రభుత్వ రంగం నిర్వీర్యమవుతుంది. దేశ సంపదంతా వేళ్లమీద లెక్కబెట్టవచ్చేటట్టు కొద్దిమంది చేతుల్లోకి పోతున్నది. మతం, దేవుడులాంటివి ఓ విశ్వాసంగా కాకుండా, అవే ప్రధానంగా మారిపోతున్నాయి. 

కొద్దిమంది చేతిలో లక్షల కోట్లు

తలసరి ఆదాయం పేరుమీద కోట్ల మంది పేదరికం దిగువన ఉంటే ఐదు, పదిమంది వేల, లక్షల కోట్ల సంపదకు అధిపతులుగా ఎదుగుతున్నారు.   భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా చెప్పుకునే భారత రాజ్యాంగమే ఈ దేశ అస్తిత్వం.  దేశంలో నిరుద్యోగ సమస్య విశృంఖల విహారం చేస్తోంది. గత పదేండ్లుగా దేశాన్నేలుతున్న బీజేపీ పాలనను గమనిస్తే సామరస్యం కనిపించడంలేదు.  

అందుకే ప్రతిపక్షాలు ఏకమై భారత రాజ్యాంగాన్ని, సెక్యులరిజాన్ని, సోషలిస్టు భావనను రక్షించుకోవడానికి కూటమిగా ఏర్పడడం ఆనివార్యమైంది.  ఆ కూటమికి సహజంగానే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నది. 

దేశ నిర్మాత నెహ్రూ ​

భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్.  అనేక మంది మహామహులు కాంగ్రెస్​ పార్టీలో నాయకులుగా ఉన్నారు.  స్వాతంత్య్రం వచ్చేకాలం నాటికి దేశం అంతఃకలహాలతో, మత కలహాలతో, చిన్న చిన్న సంస్థానలతో ముక్కలు చెక్కలుగా ఉండగా వాటిని ఒకే గొడుగు కిందికి తెచ్చింది నెహ్రూ. సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గించడానికి సెక్యులరిజం, సెమీ సోషలిజం మార్గాలను ఎన్నుకొని ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసింది నెహ్రూ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ.  భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ద్వారా రాయించి దేశానికి అందించింది కాంగ్రెస్.  

దేశ తొలి ప్రధాని నెహ్రూ వేసిన బలమైన పునాదులపై అంతస్తుల భవనాలు నిర్మించింది కాంగ్రెస్ సారథ్యంలోని ప్రధానమంత్రులు. భారీ నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, అణుప్రయోగాలు, సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి, దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించడం, విద్యాహక్కులాంటి వాటినన్నిటినీ కాంగ్రెస్​ కాపాడింది.  బీజేపీ బలపడుతున్న కొద్దీ ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు బలహీనపడుతూ వచ్చాయి. 

భారత్ జోడో న్యాయ్​యాత్రదే కీలకపాత్ర

రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్​ జోడో న్యాయ్​యాత్ర కాంగ్రెస్​ పార్టీకి,  ఇండియా కూటమికి అపార జవసత్వాలను అందిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నెల 14న ప్రారంభమయ్యే  ఈ యాత్ర మార్చి 30వరకు కొనసాగనుంది. ఈశాన్య రాష్ట్రం మణిపుర్​లో ప్రారంభమై మహారాష్ర్టలోని ముంబైలో ముగియనుంది. 66 రోజులపాటు15రాష్ట్రాల్లో 110 జిల్లాల మీదుగా సుమారు 6,713 కిలోమీటర్లు రాహుల్​యాత్ర  జరగనుంది. దాదాపు  100 లోక్​సభ స్థానాల్లో చేపట్టే భారత్​ జోడో న్యాయ్​యాత్రలో రాహుల్​గాంధీ కీలకంగా వ్యవహరించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమిలోని ఆయా పార్టీల నాయకుల ఈ యాత్రను తమకు సానుకూలంగా మార్చుకోవాలి. కర్నాటక, తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపు స్ఫూర్తిని దేశమంతటికీ విస్తరింపజేయాలి.

ఈ రాష్ట్రాల్లో అమలవుతున్న హామీలు అన్ని రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి పట్ల అనుకూల వైఖరిని పెంచుతాయి. ఈ రెండు, మూడు నెలల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ ఒక్కటే అనే నమ్మకం దేశమంతటా కలిగించాలంటే ఆ హామీలను వీలైనంత త్వరగా అమల్లోకి వచ్చేట్టు చేయాలి. ఆ పనిని కర్నాటక సీఎం సిద్దరామయ్య, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి  జెట్ ​స్పీడ్​తో చేస్తున్నారు. కాంగ్రెస్​ పార్టీ హామీల అమలు ఇండియా కూటమి గెలుపును సులభతరం చేస్తాయి. ఏదేమైనా ఏప్రిల్​, మే నెలలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు చారిత్రకావసరం. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు, నాయకులు, మద్దతుదారులు ఈ సమయంలో అవకాశవాద చర్యలకు పాల్పడితే అదో గొప్ప చారిత్రక తప్పిదమే అవుతుంది. చరిత్ర నిర్మాతలైన ప్రజలు అటువంటివారిని క్షమించరు. 

ఇండియా కూటమికి పెరిగిన ప్రాధాన్యత

కాంగ్రేసేతర  పాలిత రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమిపై అనుకూలత పెరిగింది. తత్ఫలితమే గత ప్రభుత్వాలను దించి కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్,  తెలంగాణలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క  అధికార పీఠం ఎక్కారు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వీరు విశేష కృషి చేశారు. లోక్ సభ ఎన్నికలు 4 నెలల దూరంలో ఉన్న సమయంలో ఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల ఇండియా కూటమి సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నాలుగైదు నెలల ముందు  మూడవ ఫ్రంట్ అని ప్రగల్భాలు పలికిన కొందరు అవకాశవాద రాజకీయ నాయకులు ఢిల్లీ సమావేశానికి రాకున్నా..

కాంగ్రెస్​తోపాటు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడి, ఎస్పీ, జేడీయూ, డీఎంకే, కమ్యూనిస్టులు ఇలా 28 పార్టీల నాయకులు కలిసి ఫలవంతమైన చర్చలు జరిపారు. ఆ సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును కొందరు సూచించినా.. ప్రధాని అభ్యర్థిని నిర్ణయించాల్సింది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, గెలిచిన అభ్యర్థులు నిర్ణయించాలి తప్ప ఇప్పుడు కాదని తీర్మానించడం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రక్రియ. 

‘కూటమి’ అద్భుత ప్రయోగం

కాంగ్రెస్, ఇతర పార్టీలు తాము చేసిన పనులను పథకాలను ప్రజల ముందుపెట్టి ఓట్లడిగితే.. బీజేపీ ఒకసారి అయోధ్య, మరోసారి పాకిస్తాన్, చైనా పేరుతో రాజకీయాలు చేసింది. పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, సామాజిక, ఆర్థిక అంతరాలను తగ్గించే పనులు చేయకుండా గెలుపుకోసం ఏమైనా చేస్తున్నారు.  ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికే కాంగ్రెస్ పార్టీని​ కలుపుకొని 28 రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇది భారత రాజకీయాల్లో ఓ అద్భుత ప్రయోగం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఇండియా కూటమి కలిసికట్టుగా ఉండి బీజేపీతో రాజీలేని పోరాటం చేయాల్సి ఉంది. 2024 ఏప్రిల్​, మే నెలల్లో జరిగే సారస్వత ఎన్నికల్లో ఇండియా కూటమి తప్పక గెలవాల్సిన అవసరం ఉంది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అంతో ఇంతో బలమున్న కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమిలో ప్రధాన భాగస్వామి. కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర చారిత్రాత్మకమైంది. దేశమంతా తిరిగి  ప్రజాస్వామ్యం పరిరక్షణకు ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని రాహుల్​ నొక్కి చెప్పాడు.ఈ యాత్రతో  దేశమంతటా కాంగ్రెస్​కు మునుపటి కన్నా సానుకూల వాతావరణం పెరిగిందన్నది వాస్తవం. 

- డా. కాలువ మల్లయ్య సోషల్​ ఎనలిస్ట్​