గెలుపు దారిలో ఇండియా కూటమి

గెలుపు దారిలో ఇండియా కూటమి

 ఎవరు అవునన్నా, కాదన్నా తెలంగాణతో సహా సౌత్ ఇండియా అంతా కాంగ్రెస్, దాని భాగస్వామ్యంగా ఉన్న ఇండియా కూటమి హవా ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తున్నది. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మొన్నటి దాకా 36 శాతమే ఉన్న ఇండియా కూటమి బలం 41 శాతానికి పెరిగినట్లు సర్వేలు పేర్కొంటున్నాయి.

బీఎస్పీ బలం 6 శాతానికి పడిపోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8శాతం ఓట్లు ఉన్న బీఎస్పీ ఇప్పుడు 2 శాతం ఓట్లు కోల్పోతున్నది. సమాజ్​వాది పార్టీ గత అసెంబ్లీలో 100 సీట్లు సాధించింది. బీజేపీ గెలుపునకు అప్పుడు బీఎస్పీ ఉపయోగపడింది. ఇప్పుడు కూడా అన్ని పార్లమెంట్ సీట్లలో సింగిల్​గా పోటీ చేస్తూ, ముస్లింలను ఎక్కువ నిలబెట్టి ఓట్లు చీల్చి, బీజేపీ గెలుపు కోసం బీఎస్పీ ఉపయోగపడే వ్యూహంతో ఉంది. ఈ విషయాన్ని  ఓటర్లు పక్కాగా గమనిస్తున్నారు అంటున్నారు. 

యూపీ, బిహార్​, మహారాష్ట్రలో పుంజుకున్నది

ఇటీవల ఒకే సారి జరిగిన తెలంగాణ, చత్తిస్ గఢ్​ రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో తెలంగాణను కాంగ్రెస్, మిగిలిన మూడు రాష్ట్రాలను బీజేపీ గెలుచుకున్నది. అయినప్పటికీ ఆ రాష్ట్రాల్లోని పార్లమెంట్ పరిధిల్లో కాంగ్రెస్​కు మొత్తంగా రెండు లక్షల ఓట్లు బీజేపీ కన్నా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణల్లో మెజారిటీ సీట్లు ఇండియా కూటమికే దక్కే పరిస్థితి  కనిపిస్తున్నది. నార్త్ ఈస్ట్​లోనూ ఇండియా కూటమి ప్రభావం ఉన్నది. 

బీహార్​లో మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రభావం, ప్రవాహంలో ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా సీఎం నితీశ్​ కుమార్ కు ఉన్న కాస్తో, కూస్తో పలుకుబడి కూడా కొట్టుకునిపోయే పరిస్థితి పలు సర్వేల్లో కనిపిస్తున్నది. మహారాష్ట్రలోనూ ఇండియా కూటమిదే గాలి ఉన్నది. మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, దిగ్గజ నేత శరద్ పవార్ల గాలి వీస్తున్నది. కాంగ్రెస్ ఇక్కడ, యూపీలో, బీహార్​లో కూటమిలోని పార్టీలతో పొత్తులో సీట్లను తగ్గించుకుని ఐక్యతగా ముందుకు రావడం బీజేపీకి మింగుడుపడని విషయంగా పేర్కొనవచ్చు! 

కూటమిలో ఉద్ధండులు

గుజరాత్ లాంటి రాష్ట్రంలో జరుగుతున్న 8 అసెంబ్లీ ఉప ఎన్నికల్లోను నలుగురు వలస నేతలకే  బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. నవీన్ జిందాల్, అశోక్ చౌహన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ లాంటి నేతలతో బీజేపీకి భారీ నష్టమే వాటిల్లే పరిస్థితి ఉన్నది.  పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ‘చార్​సౌ పార్’ నినాదం ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే తుస్సుమనేలాగే కనిపిస్తున్నది. నిజం వెంట జాతీయ మీడియా లేదు, అనే విషయం చాలా వాస్తవ విషయాలతో ఎప్పుడో బయట పడింది. తన పది ఏండ్ల పాలనలో ఒక్కసారి కూడా   ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టని పీఎం నరేంద్ర మోదీని ఇంద్రుడు, చంద్రుడు అంటూ ప్రచారం చేయడంకొన్ని మీడియా సంస్థలకే దక్కిందంటే అతిశయోక్తి కాదు. 

రైతులు, నిరుద్యోగం, సమానత్వం, అసమానతలు, మహిళలు, యువకులు, విద్య, వైద్యం, సామాన్యుడి రవాణా, సౌకర్యం, కోట్ల కుటుంబాలను గుల్ల చేసిన అధిక ధరల మీద పది ఏండ్ల పీఎం మోదీ పాలనలో అసలు శ్రద్ధే పెట్టలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఉపాధి, ఉపాధి హామీ కూలీల వేతనం డబుల్ చేయడం, ప్రతి కుటుంబానికి ప్రతి నెల కనీసం పది వేల ఆదాయం కల్పించే స్కీమ్ అమలు, రైతుల ఎమ్మెస్పి  గ్యారంటీల మీద జనంలో అనుకూల పవనాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్​లో  రాహుల్ లేవనెత్తుతున్న విషయాల మీద యువత దృష్టి సారిస్తున్నది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జనాభాలో 60 శాతం యువకులు ఉన్న భారత్ లో తమ భవిష్యత్తు తీర్చిదిద్దుకునే సమయం వచ్చేసింది! అందుకే బీ ప్రాక్టికల్ అనే ఇండియా కూటమి వైపు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వైపు యువత చూస్తున్నదని అనకతప్పదు!

ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్ 

  • Beta
Beta feature
  • Beta
Beta feature