న్యూఢిల్లీ: చాట్‌జీపీటీతో వచ్చిన బింగ్ కొత్త వెర్షన్‌ను వాడుతున్న దేశాల్లో ఇండియా టాప్ 3 లో ఉందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. గూగుల్‌తో పోలిస్తే తమ సెర్చింజిన్ చాలా బెటర్ అని పేర్కొంది. చాట్‌జీపీటీతో కూడిన బింగ్ ప్రివ్యూని ఈ ఏడాది ఫిబ్రవరి 7 న మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చాట్‌జీపీటీని 2022, నవంబర్‌లో ఓపెన్‌ఏఐ లాంచ్ చేసింది. ‘సెర్చింగ్ మారింది. మరింత మారుతుంది. టీవీ వచ్చినప్పుడు రేడియో పోలేదు. కానీ, టీవీ మరింత ఎక్సైట్‌మెంట్‌గా మారింది. అలానే సెర్చ్‌లు పోవు కాని మరింత ఎక్సైటింగ్‌గా మారుతాయి. ఎందుకంటే ఇవి సెర్చ్ కూడా ఇవ్వని ఆన్సర్లను ఇస్తున్నాయి. బింగ్‌తో మేము లీడర్‌షిప్ పొజిషన్‌లో ఉన్నాం’ అని మైక్రోసాఫ్ట్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ యూసఫ్ మెహ్డి అన్నారు. .
ప్రపంచం సెర్చింజన్ల నుంచి ‘వెబ్‌కు కో–పైలెట్’ గా ఉండే వాటివైపు మారుతోందని, ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ముందుగానే గుర్తించారని పేర్కొన్నారు. ఏఐ చాట్‌బాట్‌లు సెర్చ్ చేయడాన్ని మరింత మెరుగ్గా మారుస్తాయని, ప్రశ్నలకు సమాధానాలిస్తాయని, చాట్ చేస్తాయని, కంటెంట్‌ను క్రియేట్ చేస్తాయని అన్నారు. ‘ప్రస్తుతం బింగ్‌లో 10 కోట్లకు పైగా డైలీ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. మేము 169 దేశాల్లో ఉన్నాం. టాప్ 3 మార్కెట్‌లలో ఇండియా ఉంది. ఇమేజ్ క్రియేటింగ్ ఫీచర్‌ను ఇక్కడ ఎక్కువగా వాడుతున్నారు’ అని మెహ్డి పేర్కొన్నారు.