దావోస్ : ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు, ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలు భారత ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్అన్నారు. భారత్‌ది ‘అసాధారణ విజయగాథ’గా అభివర్ణించిన ఆయన.. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్అద్భుత దౌత్య సంబంధాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు బ్లింకన్ దావోస్‌లోని ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2024’ వార్షిక సమావేశంలో మాట్లాడారు. యూఎస్, ఇండియా సంబంధాలు బలపడుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై ప్రశంసలు కురిపించిన బ్లింకన్.. ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కుల సహా వివిధ అంశాల్లో అమెరికా – భారత్ నిరంతరం దౌత్యపర సంభాషణలు జరుపుతున్నాయని గుర్తు చేశారు.