వరల్డ్ కప్ 2023 తుది సమరానికి భారత్, ఆస్ట్రేలియా జట్లు సిద్ధమైపోయాయి. 45 రోజుల పాటు అభిమానులని అలరించిన ఈ మెగా టోర్నీలో భారత్, ఆసీస్ జట్లు టైటిల్ కోసం ఆదివారం(నవంబర్ 19) అమీ తుమీ తేల్చుకుంటాయి. సెమీఫైనల్లో టీమిండియా 70 రన్స్ తో న్యూజిలాండ్ ను ఓడిస్తే.. నిన్న జరిగిన రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికాపై ఆసీస్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. 20 ఏళ్ళ తర్వాత రెండు జట్లు వరల్డ్ కప్ ఆడుతుండడంతో క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్, ఆస్ట్రేలియా 20 ఏళ్ళ క్రితం వరల్డ్ కప్ ఫైనల్ ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఆసీస్ దే ఆధిపత్యం
వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చరిత్ర చూసుకుంటే అమోఘం. ఇప్పటికే 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది కంగారూల జట్టు. 1987,1999,2003,2007,2015 సంవత్సరాలలో విశ్వ విజేతగా నిలిచింది. మరోవైపు భారత్ 1975, 2011 లలో వరల్డ్ కప్ గెలిచింది. అయితే ఈ రెండు జట్లు 2003లో వరల్డ్ కప్ ఫైనల్ ఆడాయి. ఈ మ్యాచ్ లో భారత్ ను 125 రన్స్ తేడాతో చిత్తు చేసి ఆసీస్ టైటిల్ ఎగరేసుకుపోయింది. 360 పరుగుల లక్ష్యంతో దిగిన టీమిండియా 234 పరుగులకే ఆలౌటయ్యారు. దీంతో టైటిల్ గెలవాలనే భారత్ కల తీరకుండానే పోయింది. ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ అజేయ సెంచరీ చేయగా బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు.
20 ఏళ్ళ తర్వాత మరోసారి
2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడం ఇప్పటికీ సగటు భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఆసీస్ పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. సొంతగడ్డపై ఆసీస్ ను చిత్తు చేయాలని టీమిండియాతో పాటు ప్రతి భారతీయుడు ఎదురు చూస్తున్నాడు. ఆడిన 10 మ్యాచ్ ల్లో ఓటమి లేకుండా విజయాలను సాధించింది. మరో వైపు ఆసీస్ ఈ టోర్నీ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయినా ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా 8 మ్యాచ్ ల్లో గెలిచి కంగారూల జట్టు కూడా మంచి ఫామ్ లోనే ఉంది.
ఒకప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ ను శాసించింది. ప్రత్యర్థి ఎవరైనా చిత్తు చేయడం ఆ జట్టు అలవాటుగా మార్చుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రతి జట్టు కూడా బలంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై వరల్డ్ కప్ లో అదరగొట్టేస్తుంది. రోహిత్ సారధ్యంలో టీమిండియా ఫామ్ ను చూస్తుంటే ఈ సారి కంగారూల జట్టుకు పరాభవం తప్పేలా కనిపించడం లేదు.