నార్త్ సౌండ్ (అంటిగ్వా): తొలి రౌండ్‌లో అజేయంగా నిలిచి సూపర్–8 మొదటి పోరులో అఫ్గానిస్తాన్ పని పట్టిన టీమిండియా టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ బెర్తుపై కన్నేసింది. శనివారం జరిగే మ్యాచ్‌లో పొరుగు దేశం బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. ఇందులో గెలిస్తే నాలుగు పాయింట్లతో రోహిత్‌సేన నాకౌట్ బెర్తు ఖాయం చేసుకోనుంది. సూపర్8 ఆఖరి పోరులో బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో బంగ్లా పులులను పడగొడితే ఎలాంటి ఇబ్బంది లేకుండా సెమీస్ చేరుకోవచ్చు.
ఇప్పటికే ఆసీస్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న బంగ్లాకు ఈ మ్యాచ్ చావోరేవో కానుంది. విజయమే టార్గెట్ గా బరిలోకి దిగుతున్న ఇరు జట్లూ తమ బ్యాటింగ్ స్టార్స్ సత్తా చాటాలని కోరుకుంటున్నాయి. బలాబలాలు, ముఖాముఖీ రికార్డులు చూస్తే ఈ పోరులో ఇండియానే అల్టిమేట్ ఫేవరెట్. కానీ, మెగా టోర్నీల్లో ఇండియా, బంగ్లా మధ్య గతంలో హోరాహోరీ పోరాటాలు సాగాయి. తమదైన రోజు బంగ్లా ఆటగాళ్లు అద్భుతాలు చేయగలరు. కాబట్టి ఆ టీమ్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయకుండా తమ పూర్తి సత్తాను చాటాలని రోహిత్‌సేన భావిస్తోంది.
టాప్ హిట్టవ్వాలి
అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసిన ఒక రోజు గ్యాప్‌లోనే రోహిత్‌సేన బంగ్లాతో పోరుకు సిద్ధమైంది. అఫ్గాన్‌పై ఈజీగా గెలిచినప్పటికీ ఇండియా టాపార్డర్ నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌లో ఇండియాకు ఒక్కసారి కూడా సరైన ఆరంభం లభించలేదు. పాకిస్తాన్‌పై రోహిత్, కోహ్లీ జోడించిన 12 రన్సే తొలి వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం. మిడిలార్డర్‌లో ఎవరో ఒకరు ఆదుకోవడం.. బౌలర్లు అద్భుత పెర్ఫామెన్స్ చేస్తుండటంతో ఇండియా ముందుకొస్తోంది. తొలి రౌండ్‌లో 1, 4, 0 స్కోర్లతో నిరాశ పరిచిన విరాట్ కోహ్లీ గత మ్యాచ్‌లో 24 బంతుల్లో 24 రన్స్ చేశాడు. ఈ ఫార్మాట్‌కు ఈ స్ట్రయిక్ రేట్ ఏమాత్రం సరిపోదు.
ఇక, ఐర్లాండ్‌పై ఫిఫ్టీ తర్వాత గత మూడు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 13, 3, 8 స్కోర్లతో ఫెయిలయ్యాడు. ఈ ఇద్దరితో పోలిస్తే వన్ డౌన్ బ్యాటర్ పంత్ ఫర్వాలేదనిపిస్తున్నా.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడటం లేదు. నాకౌట్ ఇలా ఆడితే ఇబ్బంది తప్పదు. కాబట్టి ఓపెనర్లు కోహ్లీ, రోహిత్ వెంటనే జోరందుకోవడం జట్టుకు అత్యంత కీలకం కానుంది. పంత్ తన శుభారంభాలను సద్వినియోగం చేసుకోవాలి. వరుసగా రెండు ఫిఫ్టీలు కొట్టిన సూర్యకుమార్ అదే ఫామ్ కొనసాగిస్తే బంగ్లాను పడగొట్టడం పెద్ద కష్టమేం కాబోదు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాట్, బాల్‌తో రాణించడం ప్లస్ పాయింట్ అయినా... హార్డ్ హిట్టర్ శివం దూబే హిట్టవ్వలేక జట్టుకు భారంగా మారాడు.
తను గాడిలో పడకుంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్‌లో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవడం మంచిది. స్పిన్ ఆల్‌రౌండర్ జడేజా సైతం ఫెయిలవుతున్నాడు. బ్యాటింగ్ చేసిన మూడు ఇన్నింగ్స్‌ల్లో 4, 0, 7 స్కోర్లతో సరిపెట్టిన అతను నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కటే వికెట్ పడగొట్టాడు. తను కూడా గాడిలో పడాల్సిన అవసరం ఉంది. పేస్ లీడర్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగం మాత్రం అదరగొడుతోంది. ముఖ్యంగా బుమ్రా ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తున్నాడు. అర్ష్‌దీప్, అక్షర్ పటేల్ కూడా ఆకట్టుకుంటున్నారు. గత మ్యాచ్ లో సిరాజ్ ప్లేస్‌లో బరిలోకి దిగి రాణించిన చైనామన్ కుల్దీప్ యాదవ్ ను కొనసాగించే అవకాశం ఉంది.
బంగ్లాకూ అదే సమస్య
బంగ్లాదేశ్‌ను కూడా బ్యాటింగ్ వైఫల్యం వెంటాడుతోంది. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓపెనర్లు లిటన్ దాస్, తంజిద్ ఖాన్ ఫెయిల్యూర్ జట్టును దెబ్బతీస్తోంది. ఆసీస్‌తో మ్యాచ్‌లో నజ్ముల్ శాంటో, తౌహిద్ హృదయ్ తప్ప మిగతా వాళ్లంతా నిరాశ పరిచారు. పవర్ హిట్టర్లు లేకపోవడం ఆ జట్టుకు సమస్యగా మారింది. సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఆ జట్టుపైనే ఒత్తిడి ఉండనుంది.
బుమ్రా వంటి వరల్డ్ టాప్ పేసర్‌ను ఎదుర్కొని నిలవడం ఆ టీమ్ బ్యాటర్లకు సవాల్‌గా మారనుంది. బౌలింగ్‌లో బంగ్లాదేశ్ ఆకట్టుకుంటోంది. పేసర్లు ముస్తాఫిజుర్, తంజిమ్ హసన్, స్పిన్నర్ రిషద్ హుస్సేన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మిగతా స్పిన్నర్ల నుంచి వీళ్లకు సపోర్ట్ అవసరం. ఏదేమైనా బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా సత్తా చాటితేనే ఇండియాకు బంగ్లా గట్టి పోటీ ఇవ్వగలదు.