- మ్యాచ్‌కు వర్షం ముప్పు!
లాడర్‌హిల్ (అమెరికా) : టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా ఆఖరి లీగ్ మ్యాచ్‌కు రెడీ అయ్యింది. శనివారం జరిగే గ్రూప్–ఎ పోరులో కెనడాతో పోటీ పడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నా.. ఫ్యాన్స్ మాత్రం విరాట్ కోహ్లీ ఫామ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌లో 700 రన్స్‌కు పైగా సాధించిన కింగ్ కోహ్లీ మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం 5 రన్స్‌కే పరిమితమయ్యాడు. దీంతో అతని బ్యాటింగ్ ఫామ్‌పై సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఈ నేథ్యంలో కనీసం ఈ మ్యాచ్‌లోనైనా విరాట్ గాడిలో పడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కెప్టెన్ రోహిత్ కూడా ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
లో స్కోరింగ్ మ్యాచ్‌లు కావడంతో మిగతా బ్యాటర్లు ఎలాగోలా గెలిపిస్తున్నారు. కానీ సూపర్–8 మ్యాచ్‌లన్నీ విండీస్‌లో జరగనున్న నేపథ్యంలో ఈ ఇద్దరు ఫామ్‌లోకి రావడం అత్యవసరం. మిడిల్‌లో రిషబ్, సూర్యకుమార్ టచ్‌లో ఉండటం లాభించే అంశం. ఐపీఎల్‌లో ఆకట్టుకున్న దూబే కూడా బ్యాట్ ఝుళిపించాలి. లేదంటే శాంసన్, జైస్వాల్‌లో ఒకరికి చోటు కల్పించొచ్చు. ఒకవేళ జైస్వాల్ టీమ్‌లోకి వస్తే కోహ్లీ మూడో నంబర్‌లో ఆడతాడు. డ్రాప్ ఇన్ పిచ్‌లపై ఇండియా బౌలింగ్ మాత్రం అదుర్స్ అనిపించింది. పేస్ త్రయం బుమ్రా (5 వికెట్ల), హార్దిక్ (7), అర్ష్‌దీప్ (7) ప్రత్యర్థి టీమ్స్‌కు కోలుకునే చాన్స్ ఎక్కడా ఇవ్వలేదు. కాబట్టి కెనడాపై అదే ఫామ్‌ను కొనసాగించాలి. సిరాజ్ (1), జడేజా కూడా చెలరేగితే ఇండియాకు తిరుగుండదు. ఒకవేళ జడేజా, అక్షర్‌కు బ్రేక్ ఇవ్వాలనుకుంటే కుల్దీప్, చహల్ తుది జట్టులోకి రావొచ్చు.
ఆరోన్ జాన్సన్‌పై దృష్టి
ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడిన కెనడా కూడా విజయంతో టోర్నీని ముగించాలని కోరుకుంటోంది. ఐర్లాండ్‌పై 12 రన్స్‌తో నెగ్గడం టీమ్‌లో కాన్ఫిడెన్స్ పెంచింది. అదే ఫామ్‌ను ఇండియాపై కూడా చూపెట్టాలని భావిస్తోంది. అయితే ఇది జరగాలంటే ఓపెనర్ ఆరోన్ జాన్సన్ బ్యాటింగ్‌లో చెలరేగాలి. పాక్‌తో మ్యాచ్‌లో ఫెయిలైన దలివాల్, పర్గత్ సింగ్, కిర్టన్, శ్రేయస్ మొవ్వా, రవీందర్ పాల్ సింగ్ ఫామ్‌లోకి రావాలి. కానీ వీళ్లు ఇండియా బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలుస్తారా? అన్నదే సందేహంగా మారింది. బౌలింగ్‌లో కెనడా పెర్ఫామెన్స్ అనుకున్న స్థాయిలో లేదు. కాలీమ్, గోర్డన్, హెలిగర్, సాద్ బిన్, జునైద్ ప్రభావం చూపిస్తే ఇండియాకు పోటీ ఇవ్వొచ్చు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఇండియాను ఓడించడం కంటే గట్టి పోటీ ఇస్తే చాలని కెనడా భావిస్తోంది.