- ఆఖరి పంచ్ ఎవరిదో?
- 4-1తో సిరీస్ విక్టరీపై టీమిండియా గురి
- వందో టెస్ట్ ఆడనున్న అశ్విన్, బెయిర్‌స్టో
- 9.30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో లైవ్
ధర్మశాల: ఓవైపు సిరీస్‌ను 4–1తో ముగించాలని టీమిండియా.. మరోవైపు ఆఖరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని ఇంగ్లండ్.. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్ట్‌కు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి జరిగే ఈ మ్యాచ్‌లో ఇరుజట్లూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా, రవిచంద్రన్ అశ్విన్, బెయిర్‌స్టోకు ఈ మ్యాచ్ చిరస్మరణీయం కానుంది. ఈ ఇద్దరి కెరీర్‌లో ఇది వందో టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా తమ సత్తా చూపాలని ఇద్దరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే సిరీస్ నెగ్గి జోష్ మీదున్న ఇండియా ఫేవరెట్‌గా దిగుతుండగా, ఇంగ్లిష్ టీమ్ కాస్త ఒత్తిడితో కనబడుతున్నది.
తుది జట్టులో నో ఛేంజ్..
ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఫైనల్ ఎలెవన్‌లో పెద్ద మార్పులు చేయడం లేదు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో దిగనుంది. బుమ్రా రాకతో పేస్ బౌలింగ్ బలం రెట్టింపైంది. రెండో పేసర్‌గా సిరాజ్‌ను కంటిన్యూ చేయనున్నారు. స్పిన్నర్లుగా అశ్విన్, కుల్దీప్, జడేజా ప్లేస్ ఖాయం. పిచ్‌ను బట్టి మూడో పేసర్‌కు చాన్స్ ఇస్తే కుల్దీప్ ప్లేస్‌లో ఆకాశ్ దీప్ రావొచ్చు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. రోహిత్, గిల్ కూడా గాడిలో పడితే భారీ స్కోరు ఖాయం. దేవదత్ పడిక్కల్‌కు ప్లేస్ ఇస్తారని భావించినా రజత్ పటీదార్‌నే కొనసాగించనున్నారు. సర్ఫరాజ్, ధ్రువ్ జురెల్ మిడిలార్డర్ బాధ్యతలను చూసుకోనున్నారు. ఓవరాల్‌గా గత మ్యాచ్ ఫామ్‌ను కొనసాగిస్తూ 4–1తో సిరీస్ ముగించాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది.
మార్క్ వుడ్ ఆగయా..
గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న పేసర్ మార్క్ వుడ్ ఈ టెస్ట్‌కు అందుబాటులోకి వచ్చాడు. మిగతా ఇంగ్లండ్ టీమ్‌లో ఎలాంటి మార్పు లేదు. బ్యాటింగ్‌లో క్రాలీ, డకెట్, పోప్ ఫెయిలవ్వడం ప్రతికూలంగా మారింది. రూట్ పోరాటం చేస్తున్నా రెండో ఎండ్ నుంచి సరైన సహకారం అందడం లేదు. బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్‌పై కూడా భారీ అంచనాలున్నాయి. ముగ్గురు స్పిన్నర్ల ఫార్ములాతోనే ఇంగ్లండ్ ఆడనుంది.
షోయబ్ బషీర్‌కు తోడు టామ్ హర్ట్‌లీ, రూట్‌ను కంటిన్యూ చేయనున్నారు. అండర్సన్, వుడ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.