ఇండోనేషియాతో భారత్​ ఐదు కీలక ఒప్పందాలు

 ఇండోనేషియాతో భారత్​ ఐదు కీలక ఒప్పందాలు
  • రక్షణ, వాణిజ్య సహకార, సైబర్​ భద్రతపై అగ్రిమెంట్లు

న్యూఢిల్లీ: రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, ఇండోనేసియా నిర్ణయించుకున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, సప్లై చైన్ అంశంలో కలిసి పనిచేయాలనుకుంటున్నామని, టూవే ట్రేడ్ బాస్కెట్ లో ఇండోనేషియా ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అథితిగా ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే.

 ఈ సందర్భంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్​లో సుబియాంటోతో మోదీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆరోగ్యం, సముద్ర భద్రత, కల్చర్, డిజిటల్ స్పేస్ తదితర రంగాలలో సహకారాన్ని అందించుకునేలా ఐదు ఒప్పందాలపై సంతకం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘‘ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రతలు, అంతర్జాతీయ చట్టాల కొనసాగింపునకు కట్టుబడి ఉన్నం. ఈ ప్రాంతంలో ఇండోనేషియాకు భారత్ చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్నిదేశాల నౌకల రాకపోకలు జరగాలనేది ఇరుదేశాల అభిమతం’’ అన్నారు. బ్రిక్స్‌‌ కూటమిలోకి ఇండోనేషియా చేరేందుకు మద్దతు ఇస్తామన్నారు.

ఉగ్రవాద వ్యతిరేకత, డీ-రాడికలైజేషన్‌‌లో సహకారంపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్టు చెప్పారు. కొన్నేండ్లుగా రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందుతుందని. గతేడాది అది 30 బిలియన్ల డాలర్లు దాటిందని మోదీ అన్నారు. ఇండోనేషియాలోని బోరోబుదూర్ బౌద్ధ దేవాలయం, ప్రంబనన్ హిందూ దేవాలయ పరిరక్షణ, అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. సుబియాంటో మాట్లాడుతూ.. మోదీతో చర్చలు చాలా ఫ్రాంక్​గా జరిగాయన్నారు. ఉమ్మడి ఆసక్తి ఉన్న అనేక కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు పక్షాలు అంగీకరించాయని తెలిపారు. ఇండోనేషియాలో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​రంగంలో పెట్టుబడులకు ఇండియా కంపెనీలను ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు.