చెన్నై: ఇండియా, సౌతాఫ్రికా విమెన్స్ మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20 వర్షంతో అర్ధాంతరంగా రద్దయింది. సఫారీల ఇన్నింగ్స్ తర్వాత ఎడతెరిపి లేకుండా వాన పడటంతో ఇండియా ఇన్నింగ్స్ సాధ్యం కాలేదు. గ్రౌండ్ మొత్తం చిత్తడిగా మారడంతో కటాఫ్ టైమ్ వరకు వేచి చూసిన అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు టాస్ ఓడిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 177/6 స్కోరు చేసింది. బ్రిట్స్ (52), అనెకా బోస్ (40), వోల్వర్త్ (22), కాప్ (20) రాణించారు. పూజా, దీప్తి చెరో రెండు వికెట్లు తీశారు. మూడు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం సౌతాఫ్రికా 1–0 లీడ్లో ఉంది. మంగళవారం చివరి టీ20 జరగనుంది.