
బ్యాంకాక్: భారతదేశం, థాయిలాండ్ తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ రెండు దేశాలు.. ఇండో -పసిఫిక్‌లో స్వేచ్ఛాయుత, బహిరంగ, సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని నమ్ముతాయని.. విస్తరణ వాదాన్ని కాదని చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
6వ బంగాళాఖాత ప్రాంత బహుళ రంగ, సాంకేతిక, ఆర్థిక సహకార (బిమ్ స్టెక్) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ గురువారం థాయిలాండ్ వెళ్లారు. అక్కడ థాయ్ ప్రధాని పేటోంగ్‌టార్న్ షినవత్రాతో ద్వైపాక్షిక సహకారం, వివిధ రంగాలపై విస్తృత చర్చలు జరిపిన తర్వాత వారిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు.
"భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, థాయిలాండ్ మధ్య పర్యాటకం, సంస్కృతి, విద్యా రంగాలలో సహకారంతో పాటు పరస్పర వాణిజ్యం, పెట్టుబడులపై చర్చించాం" అని మోదీ తెలిపారు. ఎంఎస్ఎంఈ, చేనేత, హస్తకళలలో సహకారం కోసం ఒప్పందాలు కూడా జరిగాయన్నారు. అలాగే, మోదీ పర్యటన సందర్భంగా 18వ శతాబ్దపు రామాయణ కుడ్య చిత్రాల ఆధారంగా రూపొందించిన స్మారక స్టాంపును విడుదల చేసినందుకు థాయ్ ప్రభుత్వానికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం-, థాయిలాండ్ మధ్య శతాబ్దాలుగా సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంబంధాలతో బలమైన బంధం కొనసాగుతోందని మోదీ అన్నారు.