ప్రగతిశీల దేశంగా భారత్ : గౌతమ్ ఆర్‌‌ దేశిరాజు

ప్రగతిశీల దేశంగా భారత్ : గౌతమ్ ఆర్‌‌ దేశిరాజు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022 ఆగస్టు 15 నాటికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ తన సందేశంలో ప్రజలకు ఒక పిలుపునిచ్చారు. మనం ఒక స్వతంత్ర జాతిగా 2047లో శతాబ్ది వేడుకలు చేసుకుంటామని, అప్పటికి భారత్‌‌ ప్రగతిశీల దేశంగా రూపొందుతుందన్నారు. ఆ మైలురాయి దిశగా పయనంలో మనమంతా భాగస్వాములం కావాలని ఆయన కోరారు. ప్రధాని చెప్పిన లక్ష్యానికి మరో 25 ఏండ్లు ఉంది. ఇది సుదీర్ఘ కాలమేమీ కాదు. శాస్త్ర-సాంకేతిక రంగాల్లో గణనీయమైన పురోగతి లేనిదే ‘ప్రగతిశీల’ గుర్తింపు సాధన సులభం కాదు.  దేశ శాస్త్రవిజ్ఞానం వాస్తవ ప్రగతిశీల స్థాయికి చేరాలంటే అందుకు నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి. ఇండోనేషియాలోని బాలిలో గత వారం జీ20 సదస్సు తర్వాత భారత్ ​దానికి అధ్యక్ష పదవిని చేపట్టడం ద్వారా ఈ అంశాలకు మరింత ప్రాముఖ్యం పెరిగింది. ఈ మేరకు ప్రభుత్వం ‘సైన్స్- 20’ లేదా ‘ఎస్‌‌ 20’ పేరిట ఒక ప్రత్యేక శాస్త్రవిజ్ఞాన టీంను ఏర్పాటు చేసింది. ‘ఎస్‌‌20’ శిఖరాగ్ర సదస్సు సన్నాహాల పర్యవేక్షణ కోసం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం  నిర్వహించింది. 2023 జులైలో కోయంబత్తూరులో నిర్వహించే ‘ఎస్‌‌20’ సదస్సుకు ‘ఆవిష్కరణాత్మక సుస్థిర వృద్ధికి వినూత్న శాస్త్రవిజ్ఞానం’ అంశాన్ని థీమ్​గా నిర్ణయించింది. పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానాల దిశగా ప్రోత్సాహకర విధానాలను రూపొందించే సహకారపూరిత వాతావరణాన్ని ఈ సదస్సు ఏర్పరచగలదని ప్రభుత్వం ఆశాభావంతో ఉన్నది. 

వాలసవాదుల దెబ్బతో..

భారత్‌‌ అంతర్జాతీయంగా మంచి స్థానం పొందడానికి అనేక దశాబ్దాలు పట్టింది. వచ్చే ఏడాది జీ20 కూటమికి మన దేశం అధ్యక్షత వహించనుండటం మరో ముందడుగు. తద్వారా సాంకేతిక స్వీయ సామర్థ్యం, విదేశీ సహకారాల మధ్య సమతుల్యం సాధించే అవకాశం ఉంది. దేశానికి జాతీయ దార్శనిక దృష్టినివ్వడం ప్రధానమంత్రి కర్తవ్యం. గత ప్రధానులు మనకు ‘జై జవాన్ -జై కిసాన్’, ‘జై విజ్ఞాన్’ పేరిట జాతిని ప్రోత్సహించారు. ప్రధాని మోడీ ఇప్పుడు దానికి ‘జై అనుసంధాన్‌‌’ను కూడా జోడించారు. ప్రస్తుత సుస్థిర, సార్వజనీన వాతావరణంలో శాస్త్రవిజ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలు అత్యంత కీలకంగా మారాయి. అయితే, శాస్త్రవిజ్ఞానాన్ని ప్రయోగశాలల నుంచి ప్రజలకు చేర్చే విజ్ఞాన పరిశోధన- ఆవిష్కరణ ప్రక్రియలు అత్యావశ్యకం. ఈ దిశగా శాస్త్రవిజ్ఞాన రంగంలో భారీ పెట్టుబడులు పెట్టనిదే ఉన్నత జీవన ప్రమాణాలతో ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థలుగా మారడం ఏ దేశానికీ సాధ్యం కాదు. ప్రగతిశీల దేశంగా మన పరివర్తన పయనాన్ని వలసవాదం దెబ్బతీసింది. అందుకే పశ్చిమ దేశాలతో పోలిస్తే150 ఏండ్లు, చైనాతో పోలిస్తే సుమారు30 ఏండ్లు వెనుకబడ్డాం. ప్రస్తుతం మన ముందు ఉన్న 25 ఏండ్ల ప్రణాళికతో లక్ష్యాలను అందుకోగలం. 

విదేశాంగ విధానం కీలకం

గణాంకాల రీత్యా చూస్తే ఈ ఏడాది జీడీపీలో దాదాపు 7.8 శాతం వృద్ధి అంచనాతో 2026–-27 నాటికి 5 ట్రిలియన్‌‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం సాధ్యమేనని చెప్పొచ్చు. అలాగే శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనాలకు మారడం ద్వారా 2031-–32 నాటికి 9 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ స్థాయిని కూడా ఊహించవచ్చు. ఇలా ద్రవ్యపరంగా ప్రపంచంలోని తొలి మూడు అగ్రదేశాల్లో ఒకటిగా ఉంటాం. కానీ కొనుగోలు శక్తి సమానత పరంగా మరింత మెరుగు పడాలి. 2047 నాటికి లక్ష్యం చేరాలంటే మనం ఏం చేయాలో  మన కర్తవ్యాన్ని వివరిస్తూ ఆర్.జగన్నాథన్, ఆశిష్ చందోర్కర్ ‘స్వరాజ్య’లో ఓ వ్యాసం రాశారు. దానికి అదనంగా- విద్య, ఆరోగ్యం సహా ఔషధ రంగం, మహిళల ఆరోగ్యం, ఎగుమతులను జోడించాలి. డిమాండ్ -సరఫరా అసమతౌల్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఎరువులు సహా పోషకాహారం, సముద్ర -ధ్రువ పరిశోధనలు, నీరు, వాతావరణ మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. జన్యుశాస్త్రం, సూక్ష్మ సామగ్రి, రోబోటిక్స్, ఎలక్ట్రిక్, అధునాతన సామగ్రి, సౌరశక్తి వాహనాలు, డ్రోన్లు, బాహ్య అంతరిక్షం, సమాచార సాంకేతికత (ఐటీ)లను జోడించాలి. ఇదీగాక లోతైన ఆలోచనతో కూడిన విదేశాంగ విధానం అవసరం. నైపుణ్యాభివృద్ధి, బ్లాక్‌‌చెయిన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, సరఫరా శ్రేణి లోటుపాట్లు వంటివాటిని ఒక సమూహంగా సమన్వయం చేసుకోవాలి.

వనరుల వినియోగం

ఇంకా ప్రధానంగా ఆలోచించాల్సింది పెట్టుబడుల గురించే, ప్రస్తుతం మన విద్య, పరిశోధన రంగాలపై జీడీపీలో దాదాపు 0.8 శాతం ఖర్చు చేస్తున్నాం. అయితే, దీన్ని కనీసం 3-4 శాతానికి పెంచాల్సిన అవసరం ఉంది. చైనా ఈ భారీ పెట్టుబడులను 1990 నుంచే ప్రారంభించింది. తద్వారా శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి సాధిస్తూ నేడు స్పష్టమైన ఫలితాలిస్తున్నది. కానీ, ఇవాళ మనది కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఈ పరిస్థితిలో ప్రభుత్వమే ఇంత భారీ వ్యయం భరించాలని భావించడం సముచితం కాదు. అందువల్ల విద్యారంగంలో ప్రైవేట్ రంగం పాత్ర అవసరం ఉన్నది. మనకున్నది 25 ఏండ్ల స్వల్ప వ్యవధి కావడంతోపాటు విద్యారంగంలో ఎలాంటి ప్రాథమిక మార్పు చేపట్టినా, దాని ఫలితాలు15 ఏండ్ల తర్వాత మాత్రమే కనిపిస్తాయి. అందుకే మనకున్న వనరులను గరిష్ఠంగా వాడుకోగల వ్యూహం అవసరం. ఈలోగా నిధులు, ప్రవేశాలు, పాలనపరంగా విద్యా సంస్థల నిర్వహణ వ్యవహారాల నుంచి ప్రభుత్వం క్రమంగా వైదొలగాలి. అధికశాతం విద్యార్థులు రాష్ట్ర విశ్వవిద్యాలయాల పరిధిలో ఉంటారు కాబట్టి, కేంద్ర-– రాష్ట్ర విశ్వవిద్యాలయాల మధ్య అంతరాలను తొలగించాలి. అమెరికా 1950 ప్రారంభంలోనే బుష్‌‌ ఆధ్వర్యంలో వేగంగా ముందడుగు వేసింది. ఆయన నేతృత్వంలో విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం, ప్రత్యేకించి వారి రక్షణ ప్రయోగశాలల మధ్య సంపూర్ణ సమన్వయం సాధించింది. నేడు చైనాలోనూ ఇదే తరహా వ్యూహం కొనసాగుతున్న నేపథ్యంలో మనం కూడా అలాంటి భారీ లక్ష్యాల సాధనపై దృష్టి సారించాలి.

రాజకీయ సంకల్పం అవసరం

విద్యా సంస్థల బాధ్యతతో సంబంధంలేని ప్రభుత్వ వైజ్ఞానిక విభాగం నిర్వహణకు అణుశక్తి విభాగం(డీఏఈ) ఒక అద్భుత ఉదాహరణ. అణ్వాయుధాలకు కీలక భాగమైన అణువిచ్ఛిన్న యూ-235 తయారీ కోసం యురేనియం దిగుమతికి 1950ల నుంచి మనం కఠిన పరిమితులను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల నడుమ మోనాజైట్ ఇసుక బీచ్‌‌ల నుంచి సేకరించిన థోరియం ద్వారా భారత్‌‌ తనదైన మార్గాన్ని రూపొందించుకుంది. దీనిద్వారా తయారు చేసుకునే యురేనియం తులనాత్మకంగా తక్కువ నాణ్యమైనదే అయినప్పటికీ మన దేశానికి ప్రపంచంలోనే అత్యధిక థోరియం నిల్వలుండటం కలిసివచ్చే అంశం. ఈ థోరియం తోడ్పాటుతోనే భారత్‌‌ 2047 కల్లా జాతీయ విద్యుత్‌‌ డిమాండ్‌‌లో 30 శాతాన్ని తీర్చగలదని అంచనా. థోరియం సాంకేతికతలో మన పరిశోధన- అభివృద్ధి పురోగతి సహా ఆయుధాలు, ఇంధన అవసరాలకు తగినంత నిల్వల మద్దతు మనకుంది. జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న శాస్త్రవేత్తల గ్రూప్​తో పరిశోధనల అమలుకు వీలు కల్పించడం వల్ల ఇది సాధ్యమైంది.  వ్యూహాత్మక భద్రత, ఉత్పత్తులు, సేవలకు తగినట్లు వేగంగా విజ్ఞాన శాస్త్రాన్ని మలచే బాధ్యత గల అన్ని విద్యేతర- శాస్త్ర ప్రయోగశాలలు, సంస్థలకూ ఈ వెసులుబాటు కల్పించాలి. వీటన్నిటికి గట్టి రాజకీయ సంకల్పం అవసరం. అప్పుడే 2047 నాటికి ప్రగతిశీల ప్రపంచ పౌరులుగా మనం సగర్వంగా తలెత్తుకోగలం. ఈ వ్యాసం రూపకల్పనలో సహకరించిన దీక్షిత్ భట్టాచార్యకు ధన్యవాదాలు. 

విద్యారంగంలో మార్పులు

అదే సమయంలో తక్షణం దృష్టి సారించాల్సిన ఆర్థికేతర, శాస్త్రవిజ్ఞానేతర అంశాల ప్రాముఖ్యం తక్కువేమీ కాదు. ఎందుకంటే ఇవి సాంకేతిక ప్రగతికి అవరోధాలు కాగల ముప్పుంటుంది. ఈ మేరకు వెంటనే శ్రద్ధ చూపాల్సిన ఏడు అత్యవసర అంశాలను జగన్నాథన్‌‌ సూచించారు. న్యాయవ్యవస్థ- చట్టాల అమలులో సంస్కరణ, పరిపాలన సంస్కరణ, పైన పేర్కొన్న దృష్టి సారించని రంగాల్లో భీకర పోటీతోపాటు యుద్ధంలో కృత్రిమ మేధస్సు వాడకాన్ని పరిగణనలోకి  తీసుకుంటూ రక్షణ రంగం నవీకరణ, రాజ్యాంగ సభకు అవసరమైన తక్షణ- లోతైన మార్పులు, నిర్మాణాత్మక, లావాదేవీల అవినీతిని తగ్గించే ఎన్నికల సంస్కరణలు, నాగరికత పునర్నిర్మాణం, భారత పునరుజ్జీవన ప్రతిష్ట పునరుద్ధరణ, చివరగా కేంద్ర – రాష్ట్రాల మధ్య అధికారాల వికేంద్రీకరణ. విద్యారంగం సముచిత నిర్వహణ కూడా దేశ ప్రగతికి అత్యంత కీలకాంశం. దేశంలో ఐఐఎస్‌‌సీ, ఐఐటీలు, ఐఐఎంలు వంటి ఉన్నత విద్యా సంస్థలు భారత వాస్తవ సామర్థ్యమేమిటో ప్రపంచానికి చాటాయి. ఇవన్నీ ఉన్నా. మన విద్యావ్యవస్థతోపాటు దానికి సౌకర్యాలు సమకూర్చే మొత్తం మౌలిక వసతుల ఆధునికీకరణకు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. నాణ్యత, పరిమాణాల పరంగా శాస్త్రీయ నైపుణ్యం లేకుండా మనం ప్రగతిశీల దేశంగా రూపొందే అవకాశం ఉండదు.

- గౌతమ్ ఆర్‌‌ దేశిరాజు,
ప్రొఫెసర్​, ఐఐఎస్‌‌సీ, బెంగళూరు,
 ‘ఎస్20’ టీంలో సభ్యుడు