ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌లో భాగంగా అత్యాధునిక టెక్నాలజీని అందివ్వండి.. యూఎస్‌‌‌‌ను కోరుతున్న ఇండియా

ట్రేడ్‌‌‌‌ డీల్‌‌‌‌లో భాగంగా అత్యాధునిక టెక్నాలజీని అందివ్వండి.. యూఎస్‌‌‌‌ను కోరుతున్న ఇండియా

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా, యూకే, జపాన్ వంటి కీలక మిత్ర దేశాలతో సమానంగా   ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కింద  తమకు కూడా  కీలక టెక్నాలజీలను అందివ్వాలని అమెరికాను  ఇండియా కోరుతోంది. అంతేకాకుండా ఎగుమతి నియంత్రణలను సడలించాలని అడుగుతోంది.  భారతదేశం టెలికాం ఎక్విప్‌‌‌‌మెంట్, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఫార్మాస్యూటికల్స్, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్స్ వంటి రంగాలలో ఈ సడలింపులను కోరుతోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.   

టెక్స్‌‌‌‌టైల్స్, రత్నాలు,  ఆభరణాలు, లెదర్ గూడ్స్, గార్మెంట్స్, ప్లాస్టిక్స్, కెమికల్స్, రొయ్యలు, ఆయిల్ సీడ్స్, ద్రాక్ష, అరటిపండ్లు వంటి ఎక్కువ మంది లేబర్ అవసరముండే రంగాలపై అమెరికా సుంకాలను తగ్గించాలని కోరుతోందని చెప్పారు. మరోవైపు, యూఎస్ కొన్ని పారిశ్రామిక వస్తువులు, ఆటోమొబైల్స్ (ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు), వైన్స్, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, డెయిరీ, యాపిల్స్, ట్రీ నట్స్ వంటి వ్యవసాయ వస్తువుల రంగాలపై సుంకాలను తగ్గించాలని ఇండియాను అడుగుతోంది. 

కాగా, ట్రేడ్ డీల్‌‌‌‌ను కుదుర్చుకోవడానికి యూఎస్‌‌‌‌, ఇండియా ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బీటీఏలో భాగంగా టెలికాం ఎక్విప్‌‌‌‌మెంట్, బయోటెక్నాలజీ, ఏఐ వంటి కీలక రంగాలలో  అత్యాధునిక సాంకేతికతను పొందడానికి   వీలు కల్పించాలని ఇండియా కోరొచ్చు. కిందటి ఆర్థిక సంవత్సరంలో యూఎస్‌‌‌‌, ఇండియా మధ్య 131.84 బిలియన్ డాలర్ల (ఎగుమతులు, దిగుమతులు రెండూ కలిపి) (రూ.11.34 లక్షల కోట్ల) విలువైన వ్యాపారం జరిగింది.