
పారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అద్భుతంగా, అట్టహాసంగా ముగియగా.. క్రీడాకారులంతా పతక వేటకు సిద్ధమయ్యారు. ఓపెనింగ్ సెర్మనీకి ఒక రోజు ముందే ఆర్చరీలో ఆట ఆరంభించి అదరగొట్టిన ఇండియా అదే ఉత్సాహంతో పోటీలు అధికారికంగా మొదలయ్యే తొలి రోజు శనివారం పలు ఈవెంట్లలో పోటీకి రెడీ అయింది. బ్యాడ్మింటన్, బాక్సింగ్, హాకీ, రోయింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, షూటింగ్‌లో ఇండియా అథ్లెట్లు శుభారంభమే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు.
పారిస్ : ఒలింపిక్స్ హాకీలో వరుసగా రెండో మెడల్‌పై గురి పెట్టిన శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఒలింపిక్స్ చరిత్రలో 8 మెడల్స్ నెగ్గిన టీమిండియా ఆ తర్వాతి కాలంలో ప్రాభవం కోల్పోయింది. అయితే 41 ఏళ్ల తర్వాత టోక్యో గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్‌తో మళ్లీ చరిత్ర సృష్టించిన హాకీ వీరులు పారిస్‌లోనూ దాన్ని కొనసాగించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 16 మందితో కూడిన ఇండియా టీమ్‌లో 11 మంది ఒలింపిక్ మెడలిస్ట్‌లు ఉన్నారు. కాబట్టి అనుభవం, నైపుణ్యాన్ని ఎలాంటి కొదవ లేదు. కాకపోతే పరిస్థితులకు తగ్గట్లుగా ఆటను మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక 2023 వరల్డ్ కప్‌లో ఇండియాను ఓడించిన కివీస్ అదే రిజల్ట్‌ను రిపీట్ చేయాలని భావిస్తోంది.
12 ఏండ్ల కల నెరవేరేనా?
పారిస్ గేమ్స్ కోసం ఇండియా జంబో షూటింగ్ బృందం రెడీ అయ్యింది. మెన్స్, విమెన్స్ కేటగిరీల్లో కలిపి మొత్తం 21 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరి రెండు ఒలింపిక్స్‌లో ఇండియన్ షూటర్లు ఒక్క మెడల్ కూడా నెగ్గలేకపోయారు. దీంతో ఈసారి భారీ ఒత్తిడితో బరిలోకి దిగుతున్న షూటర్లు ఏమేరకు రాణిస్తారో చూడాలి. పతకం కోసం 10 మీ. ఎయిర్ రైఫిల్‌లో ఒలింపిక్ కోటా సాధించిన రుద్రాంక్ష్ పాటిల్‌ను కాదని సందీప్ సింగ్‌కు చాన్స్ ఇచ్చారు. ఇక అనుభవజ్ఞులైన మను భాకర్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తొమర్, అంజుమ్ మౌద్గిల్, ఎలవెనిల్ బరిలో ఉన్నారు. వరల్డ్ టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టే భాకర్.. 10 మీ. ఎయిర్ పిస్టల్, 25 మీ. పిస్టల్, 10 మీ. పిస్టల్ మిక్స్‌డ్‌లో పోటీపడుతోంది. తొలి రోజు మెన్స్, విమెన్స్‌లో క్వాలిఫికేషన్ రౌండ్స్ జరగనున్నాయి.
సాత్విక్ జంటపై అందరి దృష్టి
బ్యాడ్మింటన్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ అందించాలని టార్గెట్‌గా పెట్టుకున్న డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి తమ పోరు ఆరంభించేందుకు రెడీ అయ్యారు. వీరితో పాటు మెన్స్ సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ తొలిసారి ఒలింపిక్స్ బరిలో నిలిచారు. యంగ్‌స్టర్ తనీషా క్రాస్టోతో కలిసి విమెన్స్ డబుల్స్‌లో ఆడుతున్న వెటరన్ షట్లర్ అశ్విని పొన్నప్పకు ఇవే చివరి ఒలింపిక్స్ కానున్నాయి. ర్యాంక్, రిజల్ట్స్, ఫామ్ పరంగా జోరు మీదున్న సాత్విక్–చిరాగ్‌పై భారీ అంచనాలున్నాయి. మూడో సీడ్‌గా గ్రూప్–సిలో బరిలో నిలిచిన సాత్విక్–చిరాగ్.. తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన కార్వెల్–లబార్ జోడీతో తమ పోరు ఆరంభించనుంది. మెన్స్‌లో ప్రణయ్, లక్ష్య ఇద్దరూ కఠినమైన గ్రూప్‌లో పోటీలో ఉన్నారు. లక్ష్య గాటెమలాకు చెందిన కెవిన్ కోర్డన్‌తో, ప్రణయ్ జర్మనీ షట్లర్ ఫాబియన్ రోత్‌తో తలపడనున్నాడు. విమెన్స్ డబుల్స్‌లో అశ్విని–తనీషా.. గ్రూప్–సిలో కిమ్ సో యెంగ్–హీ యంగ్‌తో పోరు ఆరంభిస్తారు.
బోపన్న పతకంతో ముగిస్తాడా?
ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనే ఇండియా బృందంలో అతి పెద్ద వయస్కుడు రోహన్ బోపన్న. టెన్నిస్‌లో దశాబ్దాల అనుభవం ఉన్నా కెరీర్‌లో ఒలింపిక్ మెడల్ మాత్రం లేదు. దీంతో 44 ఏండ్ల వయసులో చివరిసారి ఒలింపిక్ మెడల్ కోసం అతను బరిలోకి దిగుతున్నాడు. మెన్స్ డబుల్స్‌లో యంగ్‌స్టర్ ఎన్. శ్రీరామ్ బాలాజీతో కలిసి పోరాటం మొదలుపెట్టనున్నాడు. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్ బ్రాంజ్ మెడల్ నెగ్గిన తర్వాత ఇండియాకు రెండో మెడల్ రాలేదు. ఈ నేపథ్యంలో తనకు మంచి ట్రాక్ రికార్డు ఉన్న రోలాండ్ గారోస్‌లో ఒలింపిక్స్ బోణీ చేసేందుకు రెడీ అయ్యాడు.
2017లో ఇదే గ్రౌండ్‌లో గాబ్రియోలా దబ్రోస్కీతో కలిసి బోపన్న తొలి సారి ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. తొలి రౌండ్‌లో బోపన్న–బాలాజీ.. రోజెర్ వాసెలిన్–ఫ్యాబియెన్ రీబౌల్ (ఫ్రాన్స్)తో తలపడనున్నారు. టీటీ ప్రిలిమినరీ రౌండ్‌లో హర్మీత్ దేశాయ్, బాక్సింగ్ విమెన్స్ 54 కేజీ ఫస్ట్ రౌండ్‌లో ప్రీతి పవార్, రోయింగ్ సింగిల్ స్కల్స్‌లో బాల్‌రాజ్ పన్వర్‌లో తొలి రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనన్నారు.