
- 2025లో 53 లక్షల యూనిట్ల అమ్మకం
- వెల్లడించిన సియామ్
న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో బలమైన డిమాండ్ ఉండటం వల్ల గత 2024-–25 ఆర్థిక సంవత్సరంలో మనదేశం నుంచి ఆటోమొబైల్ ఎగుమతులు 19 శాతం పెరిగి 53 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో 45 లక్షల యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఏడాది లెక్కన ఇవి 19 శాతం పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 6,72,105 యూనిట్లతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులు 15 శాతం పెరిగి 7,70,364 యూనిట్లకు చేరుకున్నాయి.
మనదేశంలో తయారవుతున్న మోడళ్లకు డిమాండ్ పెరగడంతో గత ఆర్థిక సంవత్సరంలో పీవీ విభాగం భారీ ఆర్డర్లను సాధించిందని పరిశ్రమ సంస్థ సియామ్ తెలిపింది. యుటిలిటీ వెహికల్ ఎగుమతులు 3,62,160 యూనిట్ల డిస్పాచ్‌తో ముందంజలో ఉన్నాయి. ఇవి ఏడాది లెక్కన 54 శాతం పెరిగాయి. టూవీలర్స్ఎగుమతులు 21 శాతం, త్రీవీలర్ ఎగుమతులు 2 శాతం ఎగిశాయి. కమర్షియల్ వెహికల్స్ ఎగుమతులు 23 శాతం పెరిగాయి.